ఆయుష్షు తగ్గుతుంది..ఒక్కో మనిషి సగటు ఆయుష్షులో ఐదేండ్లు లాస్

 ఆయుష్షు తగ్గుతుంది..ఒక్కో మనిషి సగటు  ఆయుష్షులో ఐదేండ్లు లాస్
  • తెలంగాణలో 3.25 ఏండ్లు 
  • రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్​లో3.9 ఏండ్లు కోల్పోతున్న జనం  
  • దేశంలో ఎక్కువగా ఢిల్లీలో12 ఏండ్లు కోల్పోతున్న ప్రజలు 
  • షికాగో యూనివర్సిటీ స్టడీలో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కాలుష్యంతో మనిషి ఆయుష్షు తగ్గుతున్నది. గుండె జబ్బులు, బీపీ, పోషకాహార లోపం కన్నా ఎక్కువగా కాలుష్యం వల్లే మన దేశంలో మనిషి సగటు ఆయుష్షు తగ్గిపోతున్నది. దేశంలో కాలుష్యం వల్ల ఒక్కో మనిషి సగటు ఆయుష్షు ఐదేండ్లు తగ్గిపోతుండగా, తెలంగాణలో 3.25 ఏండ్లు తగ్గుతున్నది. ఇది అమెరికాలోని షికాగో యూనివర్సిటీ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ చేసిన స్టడీలో వెల్లడైంది. 

ఈ వివరాలను ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) నిర్దేశించిన ప్రమాణాల కన్నా దాదాపు 8 రెట్లు అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం నమోదవుతున్నట్టు స్టడీ తేల్చింది. డబ్ల్యూహెచ్​వో ప్రకారం పీఎం 2.5 (కాలుష్య కారకం) లెవల్స్ ఒక క్యూబిక్​మీటర్ గాలిలో 5 మైక్రో గ్రాములు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో 38.16 మైక్రో గ్రాములు ఉన్నట్టు స్టడీ పేర్కొంది. దేశంలో కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో ఉందని తెలిపింది. 

ఆరెంజ్ జోన్​లో 22 జిల్లాలు  

కాలుష్యం వల్ల ఆయుష్షులో మూడేండ్లు తగ్గితే, అలాంటి ప్రాంతాలను ఆరెంజ్​జోన్​లో పెట్టారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని 22 జిల్లాలు ఆరెంజ్ జోన్​లోనే ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కాలుష్య కారకాలు డబ్ల్యూహెచ్​వో ప్రమాణాల కన్నా 8 రెట్లు అధికంగా ఉన్నాయి. మిగతా 11 జిల్లాలు ఎల్లో జోన్​లో ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కాలుష్యం నమోదవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. సిటీలో పీఎం 2.5 లెవల్స్ 44.94గా ఉన్నట్టు స్టడీ తేల్చింది. 

దీంతో హైదరాబాద్​లోని ప్రజల సగటు ఆయుష్షు 3.91 ఏండ్లు తగ్గిపోతున్నట్టు హెచ్చరించింది. సిటీలో జనాభా పరంగా, బిజినెస్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే కాలుష్యం ఎక్కువున్నదని అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలో 10 లక్షల లోపు జనాభా ఉన్న జిల్లాల్లోనూ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. కరీంనగర్​ జిల్లాలో పీఎం 2.5 లెవల్స్ 43.13గా ఉండగా, అక్కడి ప్రజల ఆయుష్షు 3.74 ఏండ్లు.. పెద్దపల్లి జిల్లాలో పీఎం 2.5 లెవల్స్ 42.71గా ఉండగా, అక్కడి ప్రజల ఆయుష్షు 3.7 ఏండ్లు తగ్గుతున్నది. కేవలం ఏడు లక్షల జనాభా ఉన్న ఆదిలాబాద్​లోనూ పీఎం 2.5 లెవల్స్ 41.43గా ఉండగా, ప్రజల ఆయుష్షు 3.57 ఏండ్లు తగ్గుతున్నట్టు స్టడీలో తేలింది. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీఎం 2.5 లెవల్స్ 30కి పైగానే ఉన్నట్టు వెల్లడైంది. 

మన దేశంలోనే ఎక్కువ కాలుష్యం 

ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాలుష్యం అత్యధికంగా ఉన్నట్టు స్టడీ హెచ్చరించింది. 2013 నుంచి ప్రపంచంలో నమోదవుతున్న కాలుష్యంలో 59 శాతం మన దేశంలోనే ఉంటున్నదని పేర్కొంది. 2020లో పీఎం 2.5 లెవల్స్ 56.2గా ఉండగా, 2021లో అది 58.7కి పెరిగినట్టు తెలిపింది. డబ్ల్యూహెచ్​వో ప్రమాణాల కన్నా 25 రెట్లు అధికంగా ఢిల్లీలో పొల్యూషన్ ఉన్నట్టు చెప్పింది. కాగా, కాలుష్యం కారణంగా ప్రపంచంలో అత్యధికంగా బంగ్లాదేశ్​లో మనిషి సగటు ఆయుష్షులో 8.3 ఏండ్లు తగ్గిపోతున్నట్టు స్టడీలో తేలింది.

డేంజర్ జోన్​లో ఢిల్లీ  

మన దేశంలో అత్యధిక కాలుష్యం, ప్రజల ఆయుష్షు ఎక్కువగా తగ్గిపోతున్న సిటీల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ ప్రజలు డేంజర్​జోన్​లో ఉన్నట్టు స్టడీ తేల్చింది. అక్కడ పీఎం 2.5 లెవల్స్ 123గా ఉండగా,  ప్రజల ఆయుష్షులో 11.9 ఏండ్లు తగ్గిపోతున్నది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 8.76 ఏండ్లు, హర్యానాలో 8.34, బీహార్​లో 7.96, పంజాబ్​లో 6.4, పశ్చిమ​బెంగాల్​లో 5.86, చత్తీస్​గఢ్​లో 5.71 ఏండ్ల చొప్పున జనం ఆయుష్షు తగ్గుతున్నదని స్టడీలో తేలింది. ఆయా రాష్ట్రా ల్లో జాతీయ సగటు ఐదేండ్ల కన్నా ఎక్కువగా ఆయుష్షు తగ్గిపోతుండడం గమనార్హం. ఈ రాష్ట్రాలను రెడ్​జోన్​లో పెట్టారు.