
- మనుషులు అక్రమ రవాణా ముఠా అరెస్ట్
- వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మంది రెస్క్యూ
- నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
నల్గొండ అర్బన్, వెలుగు : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చేపల వ్యాపారం పేరిట కూలీలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మందిని రెస్క్యూ చేశారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని కొందరు చేపల వ్యాపారులు తమ వద్ద పని చేసేందుకు బిహార్, చత్తీస్ గఢ్, ఒడిశా, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల చెందిన వ్యక్తులను తీసుకొస్తున్నారు.
రోజుకు రెండు గంటల పని, నెలకు రూ. 15 వేల జీతం, ఉచిత భోజనం, వసతి, మద్యం ఇస్తామని నమ్మించి ఏజెంట్ల ద్వారా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ, పీఏ పల్లి మండలం బాణాలకుంటకు తీసుకొచ్చారు. కొంతకాలంగా వారికి జీతాలు ఇవ్వకుండా, పని వేళలు పాటించకుండా, చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. సమాచారం అందడంతో రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ పోలీసు బృందాలు వెళ్లి దాడి చేశాయి.
36 మంది వలస కార్మికులను రెస్క్యూ చేయగా.. వీరిలో నలుగురు బాలకార్మికులు ఉన్నారు. వీరిని ఏజెంట్లు మొదట మల్లేపల్లికి తీసుకొచ్చి సెల్ ఫోన్లను తీసుకునేవారు. రాత్రి పూట బైక్ పై నేరడు గొమ్ములోని వైజాగ్ కాలనీకి తరలించి చేపలు పట్టించేవారు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగితే భౌతిక దాడులకు దిగేవారు. నిందితులు పీఏ పల్లికి చెందిన వడ్త్య జవహర్ లాల్, రామావత్ రమేశ్, నేరేడుగొమ్ము వైజాగ్ కాలనీకి చెందిన ఎరిపల్లి బాబుజీ అలియాస్ బావూజి,చాపల తాతారావు, చాపల బంగారి, ఏపీలోని అనకాపల్లికి చెందిన మైలపల్లి శివ, కారే సింహాచలం, వంక విశాఖ ఉన్నారు.
మరో ముగ్గురు వెంకన్న, లోకేశ్, జగన్ పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. దేవరకొండ ఏఎస్పీ పి. మౌనిక, డిండి, కొండ మల్లేపల్లి సీఐలు, గుడిపల్లి, నేరేడుగొమ్ము, గుర్రంపోడు ఎస్ ఐలు, రెవెన్యూ, చైల్డ్ కేర్ చైల్డ్ లైన్ సీడబ్ల్యూసీ టీమ్ లను ఎస్పీ అభినందించారు.