3 నవంబర్ 2025న చేవెళ్లలోని మీర్జాగుడా గేట్ వద్ద కంకర టిప్పర్, ఆర్.టి.సి బస్సును ఢీకొన్న ఘోర ప్రమాదంలో19 మంది దుర్మరణం చెందడం అందరి హృదయాలను కలిచివేసింది. అయితే, ఆ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు కంకరలో కూరుకొనిపోయి, తమమీద పడ్డ కంకరను తొలిగించమని విలపిస్తూ చుట్టూ వున్న జనాలను వేడుకొంటున్న దృశ్యం తలుచుకుంటేనే హృదయం బాధతో తల్లడిల్లుతోంది.
తమ మీదున్న కంకర తొలగించమని దీనంగా బాధతో విలపిస్తూ వేడుకొంటున్న బాధితులకు, జాలిగుండెగల తోటి మానవులిచ్చే సమాధానం ‘మా వద్ద పారలు లేవు గదా మేమెట్లా తొలిగించగలం’ అని. అయితే అది ఒక అరుదైన విషాదకర దృశ్యం ..మళ్లీ -మళ్లీ అవకాశం రాదని భావించిన కొందరు ఔత్సాహిక యువకులు మాత్రం ఆ ఘోర దృశ్యాన్ని తమ సెల్ఫోన్లతో వీడియోలు తీసుకోవడం మాత్రం మనుషుల్లో మానవత్వం కనుమరుగైందని రుజువు చేస్తున్నది. అంతేకాదు
ప్రస్తుత సమాజంలో యువత వక్రమార్గ గమనానికి ఇది గుర్తుగా నిలుస్తోంది.
ఈ సంఘటన మాత్రమే, కాదు, కొన్నాళ్ల క్రితం భాగ్యనగరం నాగోల్లోని ఒక గుడిలో దీపోత్సవాల సందర్భంగా జరిగిన ఒక ప్రమాదంలో దీపం చీరకు తగిలి ఒక సీనియర్ న్యాయవాది భార్య మంటల్లో దహనమయింది. చుట్టూ ఉన్నవారిలో కొందరు అమె మంటలని ఆర్పకుండా చూస్తూ ఉంటే, మరికొందరు యువకులు మాత్రం ఆమె దహనాన్ని తమ తమ సెల్ఫోన్లతో వీడియోలు తీశారు.. వారిల్లో కొందరైనా ముందుకు వచ్చి ఆ మంటలని ఆర్పి ఉంటే ఒక నిండు ప్రాణం మంటలకు బలయ్యేది కాదు. అప్పట్లో వీడియోలు తీసిన ఆ యువకుల చర్యని అతి హేయమైన చర్యగా ఒక న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇక ఇటీవల 29 నవంబర్ 2025 రోజున భాగ్యనగర్ జీడిమెట్ల షాపుర్నగర్ ప్రాంతంలో ని ఒక పైవేట్ స్కూల్లో ఆ స్కూల్ ఆయా ఒక పసిపిల్లని కిందపడేసి కాళ్లతో తొక్కుతూ తన చర్యను ఎవరూ చూడడం లేదనుకొని తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ దారుణ దృశ్యాన్ని పక్క భవనంలోని ఒక వ్యక్తి నాలుగు నిమిషాల వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు.
ఈ సందర్భగా ఈ సంఘటన గురించి ఒక సైక్రియాట్రిస్ట్ చెప్పినట్టు కేవలం ఆ వ్యక్త్తి గట్టిగా అరిచినా ఆ కిరాతక ఆయా తన దాష్టీకాన్ని ఆపి ఉండేది. ఆ హింసని ఆపే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా లైక్ల కోసం మాత్రం ఆ దృశ్యాన్నీ వీడియో తీసి గ్రూపుల్లో ఆ వ్యక్తి షేర్ చేయడం అత్యంత గర్హనీయం.
లైక్ల కోసం గ్రూపుల్లో షేర్..
రోడ్డు ప్రమాదాల్లో లారీలు, ట్రక్కులు బోల్తా పడి లారీల్లోని వస్తువులు, కూరగాయలు, రోడ్డు మీద పడ్డప్పుడు బాధితులను పట్టించుకోకుండా దొరికిన వస్తువును దొరికినట్టుగా దోచుకొని వెళుతున్న జనాలని టీవీ వార్తల్లో తరచుగా చూస్తున్నాం. ఈ సంఘటనల నేపథ్యంలో ఆలోచించినప్పుడు తేటతెల్లంగా అర్థమయ్యే విషయం మనిషిలోని మానవత్వం కనుమరుగైపోతున్నదని. అందుకు కారణాన్ని అన్వేషించినప్పుడు బట్టబయలయ్యే విషయం లోపభూయిష్టమైన మన విద్యావిధానమని. కొన్ని దశాబ్ధాల కిందటి విద్యావిధానంలో విద్యార్థులకు నైతిక విలువలని బోధించేవారు.
తల్లిదండ్రులపట్ల, ఉపాధ్యాయులపట్ల, తోటి మానవుల పట్ల, చివరకు జంతువులపట్ల కూడా విద్యార్థులు ఏవిధంగా ప్రవర్తించాలో తెలియజెప్పేవారు. అంతేకాదు, సమాజం పట్ల, దేశం పట్ల విద్యార్థుల బాధ్యతని తెలియజేసేవారు. ప్రతి తరగతిలో నీతి కథలకు ఒక పిరియడ్ ని కేటాయించేవారు.
అవన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి. అందువల్లనే మనిషిలోని మానవత్వం తనకు మనుగడ లేదంటూ మనిషికి దూరంగా పరిగెడుతున్నది. ఈ పద్ధతే కొనసాగితే నేటి యువత భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వాలు ఈ అంశం మీద దృష్టి పెట్టి బాల్యం నుంచే విద్యార్థులకు నైతిక విలువల పట్ల, మానవత్వం పట్ల అవగాహన కలిగించాలి.
- బసవరాజు నరేందర్ రావు
