
ముందు ముందు కరెంట్ బండ్లదే హవా
కరోనాతో తప్పనిసరైన పర్సనల్ మొబిలిటీ
రూ.50 వేల కోట్లుగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్
ప్రతి పెట్రోల్ పంపులో ఒక ఛార్జింగ్ స్టేషన్
ఆల్టర్నేటివ్ ఫూయ్యల్ పై ప్రభుత్వం ఫోకస్
వెలుగు, బిజినెస్‌డెస్క్: కాకపుట్టిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఈ–వెహికల్స్ వైపుకి చూస్తున్నారు. కరోనా కారణంతో ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం పర్సనల్ మొబిలిటీ అనేది తప్పనిసరి అవసరంగా మారడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుండటం వంటివన్ని ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకి, మహింద్రా అండ్ మహింద్రా వంటి పెద్ద కంపెనీలు, టూవీలర్స్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. లాక్‌డౌన్ తర్వాత ఆటో సెక్టార్‌కు కాస్త డిమాండ్ వస్తుండటంతో, ప్రజలకు అనువైన రీతిలో, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్‌ను కంపెనీలు రూపొందిస్తున్నాయి. రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా తమ డ్రైవర్లకు బ్యాటరీ పవర్డ్ వెహికల్స్‌ను అందించేందుకు ఆటో కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. 2040 నాటికి తమ వెహికల్స్ అన్ని 100 శాతం ఎలక్ట్రిక్‌గా ఉంటాయని ఉబర్ ప్రకటించింది. బ్యాటరీతో నడిచే వెహికల్స్‌లోకి మారడానికి తమ డ్రైవర్లకు 800 మిలియన్ డాలర్ల సాయం చేయనున్నట్టు ఉబర్ తెలిపింది. 2025 నాటికి ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రూ.50 వేల కోట్ల అవకాశాన్ని అందిస్తుందని అవెండస్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ అవెండస్ క్యాపిటల్ అంచనావేస్తోంది. కరోనా కారణంతో మీడియం టర్మ్‌లో అత్యధికంగా ఎలక్ట్రిక్‌తో నడిచే టూ, త్రీ వీలర్సే ఉంటాయని అంచనావేసింది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఓనర్‌షిప్ కాస్ట్ తక్కువగా ఉన్నట్టు అవెండస్ రిపోర్ట్ తెలిపింది. ఇండియాలో ఎలక్ట్రిక్ మార్కెట్‌ను నడిపించడంలో టూ, త్రీ వీలర్సే ముందుంటాయని అవెండస్ రిపోర్ట్ వివరించింది. 2024–25 నాటికి ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్ 9 శాతం వృద్ధి చెందుతుందని రిపోర్ట్ అంచనావేసింది. ఈ సెగ్మెంట్ రూ.12 వేల కోట్లకు పెరుగుతుందని తెలిపింది. ఓ సర్వే ప్రకారం ఇండియాలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడుపోతాయని తెలిసింది. ఈ–రిక్షాలు కూడా తక్కువ టైమ్‌లోనే ఇండియాలో అతిపెద్ద మార్కెట్‌ను పొందాయి. ఈ మార్కెట్ చాలా వరకు అనధికారికంగానే ఉంది. లెడ్–యాసిడ్ బ్యాటరీలతో ఇవి నడుస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది. ఈ మార్కెట్ లిథియం అయాన్ బ్యాటరీలోకి మారాల్సి ఉందని పేర్కొంది. 2024–25 నాటికి 40 శాతం ఈ–రిక్షా మార్కెట్ లి–ఐయాన్‌లోకి మారుతుందని తెలిపింది.
ఎలక్ట్రిక్ వెహికల్ ఖర్చు కి.మీకి 20 పైసలే..
పెట్రోల్ వెహికల్ ఖర్చు కిలోమీటర్‌కు రెండు రూపాయలు అయితే, ఎలక్ట్రిక్ వెహకిల్ ఖర్చు కేవలం 20 పైసలుగానే ఉంటోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. లైసెన్స్ ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్లే అవసరం లేకుండా చట్టాల్లో మార్పులు తెస్తున్నాయి. ఆయిల్ దిగుమతులను తగ్గించేందుకు ఈవీల్లోకి మారుతున్నామని కేంద్రం కూడా చెప్పింది. తమ డిపార్ట్‌మెంట్లకు అవసరమైన ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం టాటా మోటార్స్ లిమిటెడ్, హ్యుండాయ్ మోటార్ లాంటి కంపెనీలకు ఆర్డర్లు కూడా ఇస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర అధికంగా ఉండటం కాస్త ఈ మార్కెట్‌కు ప్రతికూలంగా ఉంటోంది. గతేడాది ఇండియాలో అమ్ముడుపోయిన పీవీల్లో సగానికి పైగా వెహికల్స్ ధర రూ.6 లక్షల కంటే తక్కువగానే ఉంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర రూ.10 లక్షలు, ఆపైనే ఉంటోంది. తక్కువకైతే అందుబాటులో లేవు. పెట్రోల్, డీజిల్కార్ల ధరలను ఎలక్ట్రిక్ కార్లు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని బీఎన్‌ఈఎఫ్ చెబుతోంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వెహికల్స్ ధరల్లో గ్యాప్‌ను తగ్గించాలని, అప్పుడే మాస్ అడాప్షన్ సాధ్యమవుతుందని బీఎన్‌ఈఎఫ్ రీసెర్చ్ హెడ్ శంతాను జైస్వాల్ చెప్పారు. ఈవీల ధరలు రూ.10 లక్షల కంటే తక్కువకు తీసుకురావడం చాలా కష్టమని ఎం అండ్ ఎం ఎండీ పవన్ కుమార్ గోయెంకా ఓ సందర్భంలో అన్నారు. సెల్ ధరలను తగ్గించడం, లోకల్ మాన్యుఫాక్చరింగ్‌ను పెంచడం ద్వారా ధరలను వచ్చే మూడు లేదా ఐదేళ్లలో తగ్గించవచ్చని గోయెంకా చెప్పారు.
ఈ ఎలక్ట్రిక్ టూవీలర్స్ దూసుకెళ్తున్నాయ్
ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లో ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తొలి ర్యాంక్‌ను పొందుతోంది. ఈ కంపెనీ 10 వేల యూనిట్లకు పైగా వెహికల్స్‌ను అమ్మింది. డీలర్ నెట్‌వర్క్ కూడా 300గా ఉంది. దీన్ని మరింత పెంచి, వెహికల్స్ విక్రయాన్ని పెంచాలని భావిస్తోంది. ఓకినావా ఎలక్ట్రిక్ టూవీలర్స్ కాస్ట్ రూ.40 వేల నుంచి రూ.1.20 లక్షల మధ్యలో ఉన్నాయి. ఆ తర్వాత హీరో మోటోకార్ప్ కు ఎక్కువ సేల్స్ నమోదవుతున్నాయి. ఈ ఏడాది 7400 యూనిట్ల విక్రయంతో 27 శాతం మార్కెట్ షేరును ఇది పొందింది. దీని వెహకిల్ కాస్ట్ రూ.75 వేల పైన ఉంది. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఏడాది ఇది 2900 యూనిట్లను అమ్మింది. ఎథర్ తర్వాత ఆంపియర్ వెహికల్స్ 9 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుంది.
వంద కి.మీకి ఖర్చు పది రూపాయలే..
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించేం దుకు ఆల్టర్నేటివ్‌గా ఈ వెహికల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పటిది కాదు వందేళ్ల నుంచి ఉంది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇది ఇప్పుడు అఫర్డ బుల్ రేంజ్‌కి దిగి వస్తోంది. దీన్ని మరింత అఫర్డబులిటీగా మార్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కార్బన్ ఎమిషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సస్టైనబులిటీ, ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో మేము ‘ఆటమ్ 1.0’ను లాంఛ్ చేశాం. ఈ బైక్‌కి డ్రైవింగ్ లైసెన్స్,
రిజిస్ట్రేషన్ అవసరం లేదు. చిన్న పిల్లలతో సహా పెద్ద వాళ్లూ వరకు దీనిని నడపవ చ్చు. 25 కిలోమీటర్లు దీని టాప్ స్పీడ్. మూడున్నర నుంచి నాలుగు గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకు నడుస్తుంది. వంద కిలోమీటర్లు నడిపితే ట్రెడిషినల్ బైక్‌కి రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఆటమ్ బైక్‌లో కేవలం రూ.7 నుంచి రూ.10 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఛాలెంజస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈవీ రివల్యూషన్ మొత్తం సోలార్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడితేనే సక్సెస్ అవుతుంది. థర్మల్ పవర్‌తో అయితే మళ్లీ కష్టమే. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రి క్ వెహికల్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఎలక్ట్రిక్ బైక్‌ల కాస్ట్ రూ.లక్ష, ఆ పైనే ఉన్నాయి. అదే చైనా నుంచి దిగుమతి చేసుకునేవి అయితే రూ.75 వేలు అలా ఉం టున్నాయి. మేడిన్ ఇండియా, ఎకనమిక్‌గా ఉండే బైక్ ఇప్పటి వరకు మార్కెట్‌లోకి రాలేదు. దీనిని అవకాశంగా తీసుకుని మేము ఆటమ్ బైక్‌ను రూ.50 వేలకే లాంఛ్ చేశాం. ఆటమ్ బైక్ పూర్తిగా మేడిన్ ఇండియా. దీని పార్ట్స్ అన్ని ఇండియాలో తయారు చేసివనే. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే కాస్ట్‌లీ అని, ఎక్కువ దూరాలకు వాడలేము అని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవని చెప్తూనే మేము ఈ ప్రొడక్ట్‌ను తయారు చేశాం. ఇదే మా ప్రొడక్ట్ కాన్సెప్ట్. టీవీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను చూస్తే, చాలా సంవత్సరాల నుంచి ఇవి ఇండస్ట్రియల్ కంబష్టన్ ఇంజిన్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాయి. ఇప్పటికిప్పుడు వీరు ఈవీ ల్లోకి మారాలంటే కష్టం. ఇదే కొత్త కంపెనీలకు అవకాశంగా మారింది. ఆటమ్ బైక్‌కి ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదు. ఎక్కడైనా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకంగా అవసరం లేకుండా ఆటమ్ బైక్‌ని రూపొందించాం.
69 వేల బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు..
ఇండియా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటో మొబైల్ మార్కెట్‌గా ఉంది. 20 మిలియన్ యూనిట్లతో రెండో అతిపెద్ద టూవీలర్ మార్కెట్‌గా రాణిస్తోంది. మన దేశం ఎక్కువగా ఆయిల్ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 112 బిలియన్ డాలర్ల ఆయిల్ దిగుమతులు చేసుకుంది. ఇప్పటికే దేశంలో పొల్యుషన్ లెవెల్స్ కూడా ప్రమాదకర స్థాయిలకు వెళ్లాయి. అంతేకాక కరోనాతో ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ మొబిలిటీని కోరుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పెట్రోల్ పంపుల్లో తప్పనిసరిగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 వేల పెట్రోల్ పంపుల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రజలకు మరింత దగ్గర చేయబోతుంది. ఆయిల్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త గైడ్‌లైన్స్‌లో, కొత్త పెట్రోల్ పంపుల్లో తప్పనిసరిగా ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఉండాలని చెప్పింది. ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం కోసం ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర్, భోపాల్ నగరాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.