గాజా: ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చేస్తున్న వైమానిక దాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఈ దాడులతో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం బురీజ్పై జరిపిన వైమానిక దాడుల్లో కనీసం15 మంది చనిపోయారని చెప్పింది. పదుల సంఖ్యలో పిల్లలు, పెద్దలు శిథిలాల మధ్య సమాధి అయి ఉంటారని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది. బాధితులను సెంట్రల్ గాజాలోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇప్పటికే వందలాది మంది పిల్లలు చలనం లేకుండా పడి ఉన్నారు. గాయాలపాలైన పిల్లల హాహాకారాలు, రద్దీతో అందరికీ చికిత్స అందించలేకపోతున్నారు. ఇప్పటి వరకు 3,700 కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్ పిల్లలు, మైనర్లు చనిపోయినట్లు తెలుస్తోంది.
టెల్‌అవీవ్‌కు అమెరికా ఫారెన్ సెక్రెటరి
అమెరికా ఫారెన్ సెక్రెటరి ఆంటోని బ్లింకెన్ శుక్రవారం టెల్‌అవీవ్‌కు వెళ్లారు. యుద్ధంలో అమాయక ప్రజల ప్రాణ నష్టం తగ్గించడంతోపాటు, నిరాశ్రయులకు కనీస సదుపాయాల కల్పనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చించారు.
గాజాపై అమెరికా డ్రోన్లు
హమాస్ చెరలో ఉన్న వారి జాడ తెలుసుకునేందుకు అమెరికా నిఘా డ్రోన్లు శుక్రవారం గాజా గగనతలంపై గాలింపులు చేపట్టాయి. సౌత్ ఈస్ట్ నుంచి ఇజ్రాయెల్ గగనతలం వైపు ప్రయోగించిన క్రూయిజ్ మిసైల్‌ను ఎఫ్35ఐ ఫైటర్ జెట్లు విజయవంతంగా కూల్చివేశాయని ఐడీఎఫ్ ప్రకటించింది.
