పునరావాస కేంద్రాల్లోఆకలి కేకలు

పునరావాస కేంద్రాల్లోఆకలి కేకలు
  • ముందుకు రాని హోటళ్ల యజమానులు 
  • హాస్టల్​ కుక్​లతో వంటలు చేయించిన అధికారులు
  • అనుభవం లేక టైంకు రాని ఫుడ్​
  • ధర్నాకు దిగిన వరద బాధితులు
  • ఖాళీ ప్లేట్లతో భద్రాచలంలో నిరసన

భద్రాచలం, వెలుగు : భద్రాచలం పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు ఆకలి కేకలు పెడుతున్నారు. రెవెన్యూ శాఖ నిత్యావసర సరుకులు ఇవ్వగా హాస్టల్​ సిబ్బందితో వంటలు చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. అయితే, శాఖల మధ్య సమన్వయ లోపంతో సకాలంలో వంటలు తయారు కాలేదు. వండినా వాటిని కేంద్రాలకు తరలించడానికి ఆలస్యమైంది. ఈలోపు కేంద్రాల్లోకి వచ్చే బాధితుల సంఖ్య పెరిగిపోయింది. వీరందరికీ భోజనాలు సరిపోలేదు. వృద్ధులు, చిన్న పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్​ కాలేజీ, నన్నపునేని మోహన్​ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో వరద బాధితులు ఆందోళనలు 
చేపట్టారు. 

ముందుకు రాని హోటళ్ల ఓనర్లు 
గత ఏడాది ప్రభుత్వం ప్రతి పునరావాస కేంద్రం వద్ద వంటలు తయారు చేయించి భోజనాలు పెట్టించింది. అన్నం, కూర, ఫ్రై, సాంబారు, పెరుగు, పచ్చడిలతో పాటు కొన్ని సందర్భాల్లో ఎగ్​ఫ్రైడ్​ రైస్​ కూడా పెట్టారు. సన్న బియ్యంతో భోజనం వండి వార్చారు. అయితే, వంట చేసిన వారికి బిల్లులు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. నెలల తరబడి తిప్పుకున్నారు. రూ.1.30 కోట్ల బిల్లయితే రూ.90 లక్షలు ఇచ్చారు. ఇలా ఏడు మండలాల్లో జరిగింది. ప్రస్తుత వరదలతో పునరావాస కేంద్రాలకు భోజనం వండి పెట్టడానికి అధికారులు హోటల్స్​ఓనర్లను సంప్రదించగా ఒక్కరూ ముందుకు రాలేదు.  

వాళ్లతో ఎలా సాధ్యం?
హోటల్ యజమానులు ముందుకు రాకపోవడంతో హాస్టళ్లలో పనిచేసే కుక్​లతో వంటలు చేయించాలనిaరెండు వందల మందికి తయారు చేసి పెట్టే అనుభవమే ఉండడంతో వేల మందికి వండడం వారితో కావడం లేదు. దీంతో  ఆలస్యమవుతోంది. ఈ కారణంతోనే శనివారం పునరావాస కేంద్రాలకు భోజనం టైంకు చేరలేదు. బాధితుల లిస్టులు తయారు చేయడంలోనూ లేట్​ అవుతుండడంతో భోజనం సరిపోవట్లేదు.