రూ.8 కోట్లు కొట్టేసి.. రూ.10 ఖరీదు చేసే కూల్‌‌‌‌ డ్రింక్‌‌‌‌కు కక్కుర్తిపడ్డరు

రూ.8 కోట్లు కొట్టేసి.. రూ.10 ఖరీదు చేసే కూల్‌‌‌‌ డ్రింక్‌‌‌‌కు కక్కుర్తిపడ్డరు

న్యూఢిల్లీ: పకడ్బందీ ప్లాన్​తో రూ.8 కోట్లను కొట్టేసిన ఓ కేడీ జంట..రూ.10 కూల్‌‌‌‌డ్రింక్‌‌‌‌కు కక్కుర్తిపడి దొరికిపోయింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లి అడ్డంగా బుక్ అయింది. పంజాబ్‌‌‌‌లోని లూథియానాలో జరిగిందీ ఘటన. పంజాబ్​కు చెందిన మన్‌‌‌‌దీప్‌‌‌‌ కౌర్‌‌‌‌ అలియాస్ ‘డాకు హసీనా’.. గతంలో బీమా ఏజెంట్‌‌‌‌గా పనిచేసింది. గత ఫిబ్రవరిలో జస్వీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ను పెండ్లి చేసుకొంది. భర్తతో కలిసి లూథియానాలో ‘సీఎంఎస్‌‌‌‌ ఇన్ఫోసిస్టమ్స్‌‌‌‌’ అనే క్యాష్ మేనేజ్‌‌‌‌మెంట్ సంస్థలో దోపిడీ చేసింది. ఈ నెల 10న తుపాకులతో వెళ్లి రూ.8 కోట్లను దోచుకొంది.

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన భర్త జస్వీందర్‌‌‌‌తో కలిసి నేపాల్‌‌‌‌కు వెళ్లాలని ప్లాన్ చేసింది. దారిలో దేవుళ్లకు థ్యాంక్స్‌‌‌‌ చెప్పేందుకు కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్, హరిద్వార్, హేమ్‌‌‌‌కుంద్ సాహిబ్‌‌‌‌ తదితర పుణ్యక్షేత్రాలకు దర్శించుకోవాలని భావించింది. ఈ సమాచారం అందడంతో పోలీసులు ఉత్తరాఖండ్‌‌‌‌లోని హేమ్‌‌‌‌కుంద్​ సాహిబ్‌‌‌‌లో మాటేశారు. నిత్యం వచ్చే వేలాదిమంది భక్తుల్లో మన్‌‌‌‌దీప్‌‌‌‌ను గుర్తించడం కష్టం. దీంతో పోలీసులు ‘లెట్స్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ క్వీన్‌‌‌‌ బీ’ ఆపరేషన్ షురూ చేశారు. యాత్రికులకు ఉచితంగా డ్రింక్‌‌‌‌ పంపిణీ ప్లాన్‌‌‌‌ను ప్రారంభించారు. ఫ్రీ డ్రింక్‌‌‌‌ను తీసుకోవడానికి మన్‌‌‌‌దీప్‌‌‌‌ జంట స్టాల్‌‌‌‌ వద్దకు వెళ్లింది. డ్రింక్​ తాగే సమయంలో ముఖంపై ఉన్న క్లాత్‌‌‌‌ను తొలగించడంతో పోలీసులు గుర్తుపట్టారు. వాళ్లు హేమ్‌‌‌‌కుండ్‌‌‌‌ సాహిబ్‌‌‌‌లో ప్రార్థనలు చేసుకునే వరకూ ఆగి, బయటికి రాగానే చిన్న ఛేజ్ చేసి పట్టుకొన్నారు.