ఆరు నెలల కింద ప్రేమ వివాహం.. భర్తను కొట్టి భార్య కిడ్నాప్​

ఆరు నెలల కింద ప్రేమ వివాహం.. భర్తను కొట్టి భార్య కిడ్నాప్​
  • భద్రాద్రి జిల్లా చుంచుపల్లిలో ఘటన
  • భార్య బంధువులే తీసుకెళ్లారని భర్త ఫిర్యాదు 


భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్​బోర్డు కాలనీలో పట్టపగలే నడి రోడ్డుపై భర్తపై దాడి చేసి ఆయన భార్యను ఆమె తల్లి, మేనమామ, కొందరు మహిళలు కిడ్నాప్​ చేశారు. కిడ్నాపైన మహిళ భర్త సన్నీ కథనం ప్రకారం...ఖమ్మానికి చెందిన దళితుడైన దూలగొండి సన్నీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన గిరిజన యువతి గొగ్గెల మాధవి ప్రేమించుకున్నారు. మాధవి కుటుంసభ్యులు పెండ్లికి ఒప్పుకోకపోవడంతో ఆరు నెలల కింద హైదరాబాద్​లో పెండ్లి చేసుకున్నారు. దీంతో మాధవి కనిపించడం లేదని ఆమె తల్లి ఈశ్వరమ్మ లక్ష్మీదేవిపల్లి పీఎస్​లో కంప్లయింట్​ఇవ్వగా మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా సుజాతనగర్​లోని అబ్దుల్​కలాం ఇంజినీరింగ్​కాలేజీలో ఎంబీఏ చదువుతున్న మాధవి గురువారం ఎగ్జామ్​ ఫీజు కట్టేందుకు భర్తతో కలిసి వచ్చింది. కొత్తగూడెంలో భోజనం చేసేందుకు సన్నీ, మాధవి కలిసి ఆటోలో వెళ్తున్నారు. చుంచుపల్లి మండలం హౌజింగ్​బోర్డ్​కాలనీ వద్ద కారులో వచ్చిన మాధవి తల్లి, మేనమామ, మరికొందరు మహిళలు  ఆటోను ఢీ కొట్టి ఆపారు. 

సన్నీని కొట్టి, మాధవిని తీసుకెళ్లారు. తర్వాత చుంచుపల్లి పీఎస్​కు వెళ్లిన సన్నీ కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతోనే మాధవి తల్లి, మేనమామ, ఇతర బంధువులు తనపై దాడి చేసి కిడ్నాప్​ చేశారని కంప్లయింట్​చేశాడు. ఆమెకు ప్రాణాపాయం ఉందన్నారు. మాధవి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.