భార్య ఆ విధంగా ఒత్తిడి చేస్తే భర్త విడాకులు కోరవచ్చు

భార్య ఆ విధంగా ఒత్తిడి చేస్తే భర్త విడాకులు కోరవచ్చు

వివాహం అనేది ఇద్దరు ఒకటిగా మారే పవిత్ర కార్యం. కుటుంబ జీవనానికి పెళ్లే పునాది. అయితే చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత తమ భాగస్వాములతో ఇమడలేక విడాకులు తీసుకుంటున్నారు. వివిధ కారణాలతో కోర్టులను ఆశ్రయిస్తూ వివిహ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. అయితే కొన్ని కేసుల్లో కోర్టు భార్యభర్తలు కొన్నాళ్లు కలిసి ఉండాలని సూచిస్తుంది. ఆ తర్వాత కూడా విడిపోవాలనుకుంటేనే విడాకులు మంజూరు చేస్తుంది. అయితే కలకత్తా హైకోర్టు విడాకుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.  

ప్రశాంత్ కుమార్ మండల్ అనే వ్యక్తి జర్నాను వివాహం చేసుకున్నాడు. అయితే తన భర్త అతని తల్లిదండ్రులను వదిలేసి రావాలని జర్నా  ప్రశాంత్ కుమార్ మండల్ను వేధించింది. దీంతో ప్రశాంత్ కుమార్ మండల్ పశ్చిమ మిడ్నపూర్  కోర్టును ఆశ్రయించాడు. దీంతో వీరిద్దరికి 2009లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య క్రూరత్వం నేపథ్యంలో ప్రశాంత్ కుమార్ కు ఈ విడాకులు మంజూరు చేసింది.

పశ్చిమ మిడ్నపూర్ కోర్టు తీర్పును జర్నా కలకత్తా హైకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసే భార్య నుంచి విడాకులు పొందడం తప్పుకాదని స్పష్టం చేసింది.  తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడడం కొడుకు పవిత్ర ధర్మం.  భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కుమారుడు తల్లిదండ్రులతో కలిసి జీవించడం అనేది సాధారణ అంశమని అభిప్రాయపడింది. 

కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను అతని తల్లిదండ్రుల నుంచి భార్య వేరు చేయకూడదు అన్నప్పుడు....భార్యను మాత్రం ఆమె పుట్టింటి నుంచి పెళ్లి పేరుతో శాశ్వతంగా ఎలా విడదీస్తారని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా ఎవరు చూడాలని అడుగుతున్నారు.