ఫోన్ లో మాట్లాడుతుందని..! భార్యను చంపిన భర్త

ఫోన్ లో మాట్లాడుతుందని..! భార్యను చంపిన భర్త

రంగారెడ్డి :  అనుమానం … ఒక మహిళను బలితీసుకుంది. ఇద్దరు పిల్లలను తల్లికి దూరం చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ… సులేమాన్ నగర్ లో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమాన్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా తన భార్య నగ్మా బేగంతో సులేమాన్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అమాన్… తన భార్య నగ్మా బేగంపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో భార్యను వేధించాడు. వేధింపులు తట్టుకోలేక రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో గతంలోనే కంప్లైంట్ ఇచ్చింది నగ్మా బేగం. పెద్దల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ జరపడంతో…. తిరిగి అలాంటి తప్పు చేయనని ఒప్పుకుని కేసు విత్ డ్రా చేయించాడు అమాన్.

ఐతే… ఆ తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఫోన్ లో ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఇటీవల వారిద్దరిపై మనస్పర్థలు పెరిగిపోయాయి. నిన్న రాత్రి ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. కోపంలో… అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు భర్త అమాన్. ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని.. భార్య తలపై కొట్టాడు. వద్దంటున్నా ఫోన్లో మాట్లాడుతున్నావంటూ చనిపోయేదాకా దాడిచేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ఇంట్లో నుంచి పరారయ్యాడు.

ఇంట్లో గొడవ గమనించిన స్థానికులు.. నగ్మా బేగంను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. నగ్మా తండ్రి మాజీ సాబ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని… పట్టుకుంటామని సీఐ సురేష్ చెప్పారు. పిల్లల సంరక్షణ విషయంలో ఫ్యామిలీకి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.