కథ : గోనోడు

కథ  :  గోనోడు

‘‘యువర్ సాలరీ హ్యాజ్​ బీన్ క్రెడిటెడ్’’ నోటిఫికేషన్ అచ్చింది. ఐదు అంకెల జీతం. జరంతసేపు అట్ల సూత్తనే వున్న. కండ్లల్ల తడి. ‘డబ్బులు వూరికే రావు’ టీవీలో గుండు బాస్ ఊదరగొడతాండు. అడుగు బయట పెట్టిన. రంగురంగుల పూల వానలో తడుసుకుంట యూనివర్సిటీ సెకండ్ గేట్ కాడ సడుగు ఎక్కిన. పల్లె నిడ్శి పట్నమొచ్చిన కొత్తల రోడ్డు దాటాలంటే సముద్రాన్ని ఈదినంత కష్టమనిపిచ్చేది. ఆటో వచ్చి ఆగింది. ‘పబ్లిక్ గార్డెన్..’ పురాగ మాట సుత బయటికి రాలేదు.  సరే.. ఎక్కుమన్నట్టు డ్రైవర్ సైగ చేసిండు.రెండు మూడు దిక్కుల ఆపి మరో ఇద్దరికి ఎక్కిచ్చిండు. పోలీస్ స్టేషన్ దాటి కేయూ క్రాస్ రోడ్ వచ్చేసరికి సిగ్నల్ పడ్డది. ఆలోచనలు ఉరుకులు పరుగుల మీదనే ఉన్నయి.హనుమకొండ కొచ్చి దగ్గర దగ్గర ఇరవై ఏండ్లు ఐతుంది.

ఇన్నేండ్లల్ల ఎంతగ మారిందో దానికి గవాయి నేనే. పెద్దమోరి దాటి ఐదు నిమిషాలల్ల పెట్రోల్ బంక్ సిగ్నల్ కాడ ఆగింది. దిగాల్సిన స్టాప్ ఇదే. రోడ్డు దాటంగనే పబ్లిక్ గార్డెన్. టౌన్ హాల్ దాటుకుంట నడక సాగుతాంది. నాలుగడుగులు ఏశిన్నో లేదో ‘నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం’ చేరుకున్న. అటుపక్క లేబర్ అడ్డా. ఎదురుంగ జిల్లా గ్రంథాలయం. ఇటేటు ఇరవైకి, ముప్ఫైకి కడుపు నింపే అన్నపూర్ణమ్మలు.సింతపల్కపండ్ల సీజన్ వొచ్చిందంటే సాలు ఈ ఏరియా మొత్తం జిబజిబలాడుతది. ఎడ్ల బండ్ల మీది పండ్ల గంపలు దింపుకొని ఇక్కన్నే అమ్ముతుంటరు. బ్యారం జేసి ఏమీ కొనకపోయినా రెండు రౌండ్లు కొడితే వాసనకే కడుపు నిండేది. మా ఊరి గుట్టెక్కి పండ్ల కోసం దేవులాడినట్టే వుండేది.

ఊరు యాదికొత్తే కండ్లు రెండు ధారలు గడుతై నాకిద్దరు అన్నలు, ఒక చెల్లి. అమ్మ కూలికి పోయేది. పని దొరక్కపోతే ఇండ్లల్ల పనికి పోయేది. నాయన సుత పనికి పోయేటోడు. నడి జాము రాతిరి వరకు తాగి ఇంటికివచ్చి అమ్మను నన్ను పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టేటోడు. మా కంటే కుక్కలే నయం అనిపిచ్చేది. ఇద్దరు అన్నల్ని దొరోలింటికాడ జీతం ఉంచిండు. ఇగ ఇంటికాడ నేను, చెల్లి మాత్రమే ఉండేది. పేరుకే అది ఇల్లు. వెనుకటి పూరిగుడిసె. నలుగురు పంటానికి సుత జాగలేని తావు. ఎప్పుడూ నా నిద్ర బయటి అరుగుల మీదనే. కొట్టి కొట్టి అలిష్టతోటి నాయిన పన్నంక, చేతగాని అమ్మ గట్టిగా నన్ను పట్టుకుని ఏడ్చేది. ఎందుకో అర్థం కాకపోయేది. ఈ రెండు చేతులతో అమ్మ కన్నీళ్లు తుడిచి మెడశింపుల మీద చేతులేసి అమురుకునేది. 

అరుగు మీద పంటానికి కిందా మీద ఒక్కటే గోనెసంచి దుప్పటి. రెండు కాళ్లు గోనెసంచిలో సొర్రిచ్చి తల పైకి పెట్టుకుని పడుకునేటోన్ని. రోజు సాయంత్రం గిన్నె పట్టుకుని వాడకట్టంతా తిరిగి తిరిగి పచ్చడో, పచ్చిపులుసో అడుక్కొచ్చేది. పని దొరకనప్పుడు అమ్మ కొమటోల్ల ఇంటికాడ గిన్నెలు తోమి, బట్టలు ఉతికి ఇన్నన్ని నూకలు పట్టుకొచ్చి గంజి కాచేది. అండ్ల ఉప్పేసుకొని, పచ్చడి అంచుకు పెట్టుకుని తాగేటోల్లం. ఏరోజు కడుపు తిప్పల ఆ రోజుదే అన్నట్టు ఉండేది.అందరు నన్ను ‘గోనోడు’ అని పిల్శేటోల్లు. గోనెసంచిల పండుకుంట గనుక ‘గోనోడు’ అనే పేరొచ్చింది అంతే! నాకు చిన్నప్పటి సంది నిద్రల గుర్రు కొట్టే అలవాటు ఉండేది. అందుకేనేమో ‘గుర్రోడు’ అని సుత పిల్శేటోల్లు.

గుర్రు కొడుతనని కాబోలు మా నాయిన నన్ను తన పక్కల పండుకోబెట్టుకోకపోయేది. అప్పుడప్పుడు నాయిన బాగా తాగి వత్తవత్తనే బాట పొంటి పడిపోయేటోడు. ఎవలన్నా చెప్తే అమ్మ తోటి నేను సుతబోయి లావట్టుకొని వచ్చేది. మా ఇద్దరికీ లేవకపోయేటోడు. ఎవలనన్నా సాయం అడుగుదమనుకుంటే ఏడ తిట్టి సంపుతాడోనని భయం అయ్యేది.ఇప్పుడంటే పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి మనవలు మనుమరాల్లు పుట్టినంక తన తీరు మార్చుకున్నడు. తాగుడు తగ్గించిండు. అమ్మను కొట్టుడు సుత బంజేసిండు. పేదరికం వల్ల వచ్చిన నిస్సహాయత అనుకోవాలో, మనిషి బలహీనత అని కొట్టి పడేయ్యాలో ఇప్పటికీ అర్థం కాదు.ఒక్కోసారి ఎంత మూర్ఖంగా ప్రవర్తించేటోడో తల్సుకుంటెనే గుండె దడదడలాడుతది.

ఏడెనిమిది ఏళ్లు ఉన్నప్పుడు ఇరవై కిలోల నూకల బస్తా నెత్తికెత్తి ‘నడువ్..’ అన్నడు. అంత బస్తాఎట్లా ఆస్తది. ఎత్తుకోకపోతే కొట్టుడు షరామామూలే! అప్పటి నా గోస ఎవలకు ముట్టిందోగని తవ్వపొంటి నడిచేటోల్లే పాపమని ఎత్తి పట్టుకొచ్చేది. మా నాయనను తిట్టిపోసేటోళ్ళు. ఆయనేం పట్టించుకోకపోయేది.‘‘పసి పోరడు అంతంత మూటలు లాబడితే బతుకుతడారా..’’ ఉండబట్టలేక అనేటోల్లు.‘‘నా కొడుకు నా ఇష్టం. బతుకుతే బతుకుతడు. సత్తె సత్తడు నీకెందుకు?” మోరుదోపు నాయిన తిట్ల దండకం అందుకునేది.
 

 *   *   *

అమ్మ నోట్లె నాలుక లేనిది. ఎన్నడూ ఎదురు చెప్పకపోయేది. మేనమామలు అప్పుడప్పుడు ఇంటికొత్తె నాయిన లొల్లి పెట్టేది.‘‘గిట్లయితే కాదు చెల్లె. రెండో పోరన్ని ఇక్కడ జీతం మాన్పిచ్చి నా తోటి తీసుకుపోత. అక్కడ నాకు ఎవుసం ఉన్నది. నా ఒక్కని తోటి అయితలేదు. వాన్ని సుత తీసుకపోతే నాకు ఆసరా అయితడు ఏమంటవ్?’’ అన్నడు మామ.‘‘నేనేమంటనే అన్న. నాదేమున్నది. బావను ఒక్కపాలి అడగరాదే!’’ గునిగింది అమ్మ‘‘బావను అడుగుడేందే! పెయి మీది బట్టకు సోయి లేనోడు. నీ ఒంటి మీదికి ఆయిమన్న చీర కొనియ్యనోడు. పోరగాండ్లకు ఒక్కపూట తిండి సక్కగ పెట్టనోడు.

గాయినను అడగమంటవా!’’ మావ తోక మీద లేశిన తాసుపామైండు.‘‘తాగుబోతోడని తెల్శి నా బొండిగె గోశిందెవలు? ఇయ్యాల లావు మాట్లాడుతానవ్?’’ గయ్ మని లేశింది‘‘అయ్యిందేదో అయ్యింది. నువ్వు సుత నాతోటే రాయే చెల్లి. కండ్లల్లపెట్టి జూసుకుంట’’ నసిగిండు మామ. అమ్మ నోరు మెదపలేదు. గుడ్లరిమి చూసింది.‘‘అంతకు తగ్గ బొంత. నువ్విట్ల ఉండబట్టే ఆయన అట్లున్నడు’’ చిన్నన్న రెక్క పట్టుకొని మర్రి సూడకుంట గుంజుక పోయిండు. పోతా పోతా గొర్ల మందను సుత తనతో పాటే తోల్క పోయిండు. అప్పటికి మాకున్న ఆస్తి అదొక్కటే. నాయినే గొర్ల మందను మేపేడిది. మంద పోయినంకనే కూలికి పోవుడు షురూ జేశిండు. అప్పుడిగ నెరీ తాడిడ్శిన బొంగురం అయ్యిండు. 
 

 *   *   *

మా చెల్లి, నేను మంచి సాయిత. పానానికి పానమసుంటోల్లం. మస్తు పాయిరంగ వుండేటోల్లం. ఇద్దరం కల్శి బడికి పోయేది. పొద్దుటి బువ్వకే కొంచెం కడుపు పీక్కపోయేది. రాత్రి మిగిలిన మాడన్నం చెరింత నములుకుంట బడికి వచ్చేది. బడిలో మధ్యాహ్నం పెట్టే బువ్వ కోసమే వత్తానమని దెప్పి పొడ్శేటోల్లు. అయినా అందులో నిజం లేకపోలేదు. నూరు శాతం హాజరి మా ఇద్దరిదీ! సెలవులు ఇచ్చిండ్లంటే బాయిల కాడ ఈతలు కొట్టేది. ఈతంటే బహు సరదా. అందుకేనేమో ఎప్పుడూ చెవిపోటు వస్తుండేది. ఆకలికి ఔగోళిచ్చుడు చాలా సాధారణమైన రోజుల్లోనే ఏడో తరగతికి చేరుకున్న. అప్పుడే దీనికో పరిష్కార మార్గం సుత కనిపెట్టిన. గుడిలో పొద్దుపొద్దున్నే దద్దోజనం పెట్టేటోల్లు. రాత్రిళ్ళు భజనలు జేసినంక ప్రసాదం సుత పెట్టేటోల్లు.

పెండ్లిల్లకు, ఫంక్షన్లకు ఇత్తార్లు ఎత్తుడు ఇంకా ఏదో ఒక పనికి ఆసరా అయ్యి ‘చియ్యకూర’ తినేది. అప్పుడే పనిజేత్తనే కడుపు నింపుకోవచ్చని ఎరుకైంది. ఇగ అప్పటిసంది వేట మొదలైంది.అప్పటికీ మా ఊళ్లే నాకు తెల్శి 7 పాసయింది నేనొక్కన్నే! జరంత గర్ర ఉండేది. పై సదువులకని పక్క ఊరు హైస్కూల్లో షెరీకైన. దోస్తానా పెరిగింది. గ్రూపులు కట్టుడు మొదలుపెట్టిన. చిన్న చిన్న బొమ్మలు గీసిచ్చి దోస్తుల కాడ పైసలు వసూలు చేసుడు, బ్యాచిలర్ టీచర్లకు వంటలో సాయం చేసి కడుపు నింపుకొనుడు‌‌‌‌.. ఇట్లా జీవితం సాగుతున్న రోజుల్లోనే లారీ డ్రైవర్లతో పరిచయం ఒక చేదు అనుభవం. క్లీనర్​గా వెళ్తే పైసలు బాగా సంపాయించొచ్చని బ్రెయిన్ వాష్ జేసిండ్లు. కొద్ది రోజులు రోజుల తరబడి లారీ మీద పోయేటోడిని.

లారీ డ్రైవర్ల జీవితం, క్లీనర్ల కష్టం తొందర్లోనే తెలిసొచ్చింది. చెడు సావాసాలు ఎట్లుంటయో, అవి ఎంతగా ఆకర్షిస్తయో, వాటి మాయల పడి ఎంత వ్యసనపరులమైతమో తెలివికి వస్తున్న రోజులవి. లారీకెక్కడం, హోటల్లో భోజనం, రోడ్డు పక్కన నిద్ర. విసుగొచ్చింది. నా అవతారం నేనే గుర్తుపట్టకుండ మారిపోయిన. దానికి తోడు అత్తెసరి మార్కులు. అహం దెబ్బతిన్నది. అయినా సదువు అటుకెక్కింది. అట్లట్లనే పదికి చేరుకున్న. అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఆ రోజుల్లో ఊర్లల్ల పీపుల్స్ వార్ ప్రభావం ఎక్కువ ఉండేది. అది నా మీద సుత కాస్త పడింది. రాత్రుళ్లు సమావేశాలు పెట్టేది. పాటలు పాడేది. జనం ఊగిపోయేది. ఆ జనంలో నేనూ ఒకడిని.

వాళ్లతో పాటు అడవికి బోయి తుపాకి పట్టుకోవాలని ఉబలాటంగా ఉండేది. ఒకపక్క పదో తరగతి పరీక్షలు. దోస్తులంతా భయం భయంగా పాస్ అయితమో లేదోనని గుబులు పడుతుంటె, నేనేమో ‘పీపుల్స్ వార్’ కు ఇన్ ఫార్మర్​గా పని చేసే ఒక అన్న తోటి చాలా జిగ్రీ దోస్తానా చేశిన. క్యారేజీలు మోసుకెళ్లుడు, మళ్ళీ తీసుకొచ్చుడు, ఊళ్లోని ముచ్చట్లు పూసగుచ్చినట్టు చేరవేసుడు, పోలీసోళ్ళ అలికిడిని గమనించుకుంట చాలా యాక్టివ్​గా వుండుకుంట, నూనూగు మీసాలతో చిన్నపాటి వీధి రౌడీ లెక్క పోజులు గొడుతూ, నలుగురిని పోగేశి కొట్లాటలకు పోతూ, దందా చేయడం వరకు నేర్సుకున్న.పీపుల్స్ వార్ దళం మా ఊర్లో పేదోళ్లకు భూములు పంచిన్లు.

అండ్ల మాకూ ఐదు ఎకురాల భూమి ఇచ్చిండ్రు. ఇన్నేండ్లల్ల కూటికి ఎంత గోస పడ్డమో మాకే తెలుసు. ఎవలూ ఇంటికొచ్చి పట్టెడన్నం పెట్టినోల్లు లేరు. అసోంటిది మాకు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండ్లు. అందుకే నేనెంత విశ్వాసంగా ఉండాల్నో అర్థమైంది. నా అసుంటోల్లకు ఏ కష్టమూ రాకుండ జూసుకోవాల్నంటే తుపాకీ పట్టాలె. ఉద్యమంల చేరాలె. ఎర్రజెండా రెపరెపలాడియ్యాలెనని ఆనాడే గట్టిగ నిర్ణయించుకున్న.
 

 *   *   *

ఒకరోజు పార్టీలో కొత్త రిక్రూట్​మెంట్ కోసం పిలుపునిచ్చిండ్లు. అప్పటికే మా ఊర్లో పది, పదిహేను మంది దాకా ఆడా, మగ సిద్ధంగనే వున్నం. ఏమైందో తెలువదు. విషయం బయటకు పొక్కింది. పార్టీలో పెద్ద నాయకులు ఊర్లోకి వచ్చిండ్లని పోలీసోళ్లకు ఎవరో ఉప్పందించిన్లు. చిప్ప పోలీసులు తమ బలగాలని చుట్టూ మోహరించిండ్లు. నాలుగు బజాట్ల కాడ ఒక్కొక్కలని పిట్టల్ని కాల్శినట్టు కాల్చిపడేశిండ్లు. వెన్నులో భయంసొచ్చింది. నా కండ్ల ముంగట్నే ఇన్​ఫార్మర్ అన్న రక్తపు మడుగులో గిలగిల తన్నుకుంట పానం వదిలిండు. ఎర్రజెండా మరింత ఎరుపెక్కింది. నాకున్న కోపానికీ, ఆవేశానికీ సరైన అవకాశం అందకుండనే చేజారిపోయింది. పెద్ద తలకాయలన్నీ పట్టుబడ్డయి. మిగతా కామ్రేడ్స్ అంతా నెత్తుటిని పారిచ్చిండ్లు. ఉద్యమం కొంతకాలం సద్దుమణిగింది.

   *   *   *

వయసుతో పాటే పెరిగిన ఆకర్షణ వల్ల ఒక నడివయసామె వలలో చిక్కుకొని ఊపిరాడని స్థితికి చేరుకున్న. తెల్లారితే పదో తరగతి పరీక్షలని తెల్శినా సుత ఆమె పిల్శిందని తనతో పాటే వాళ్ల ఊరికి ఎల్లిపోయిన. హాల్ టికెట్ తన దగ్గరే పెట్టుకుని నన్ను అరిగోస పెట్టింది. ఎలాగోలా తప్పించుకుని పది పరీక్షలయితే రాశిన. కానీ ఏం లాభం? రెండు తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన. తల ఎత్తుకోలేకపోయిన. విషయం తెలుసుకున్న చిన్నన్న, వదినె దుద్దులు తాకట్టుపెట్టి సప్లిమెంటరీ ఫీజు కట్టి రాపిస్తే అప్పుడు పాసైన. కానీ ఆ ఏడాది పడ్డ మనోవేదన తిండి లేనప్పుడు సుత జన్మంల పడలేదు.ఇంతలో పెద్దన్న ఏరుబడ్డడు. తన సంసారం తనకయింది. పీపుల్స్ వార్ పుణ్యమాని చేతికొచ్చిన భూమిని అన్న దున్నుకుంట తన తొవ్వ తాను జూసుకున్నడు.

అత్త కొడుక్కు ఇచ్చి చెల్లె పెళ్లి ఖాయం చేసిండు నాయిన. నాయిన ఉచ్చదొక్కిండో ఏందోగని పెద్దన్న సుత నాయిన సాలే పట్టుకున్నడు. వదినను కొట్టుడు, అయ్యా కొడుకులు ఇద్దరు కల్శి కూసోని తాగుడు సురువు జేశిండ్లు. ఇగ మిగిలింది నేనొక్కడినే! అట్లట్ల ఇంటర్మీడియెట్ గట్టెక్కి, డిగ్రీల షెరీకైన. అప్పటికి గానీ ఈ సమాజంలోని అంతరాలు బోధపడలేదు. సదువు విలువ దెల్శింది. సదువుకుంటేనే మనిషి మనిషిగా బతుకొచ్చని పురాగ అర్థమయింది.
   

*   *   *

దోస్తానా. నా జీవితంలో చెడుకైనా, మంచికైనా కారణమైనోళ్లు వాళ్లే. వివేచన జ్ఞానాన్ని అందించింది సుత వాళ్లే! సమయానికి వయిలు ఇచ్చింది వాళ్లే. నా విజయంలో సగం వారికే దక్కుతది. డిగ్రీల ఉన్నప్పుడు రూమ్ రెంట్ కట్టడానికి, తినడానికి గో‌‌‌‌స పడేది. అప్పుడు తోడుగ నిలబడ్డది వాళ్లే. వంట చేసుడు, రూమ్ క్లీనింగ్, బట్టలుతుకుడు ఇట్ల అన్ని పనులు చేసి పెట్టేటోడిని. అందుకు రూములో ఇంత జాగా, కడుపుకింత తిండి దొరికేది. నేను చదువుకోకపోయి ఉంటే ఎప్పుడో ఎన్కౌంటర్లో కుక్క సావు సచ్చేటోన్ని అని చాలా సార్లు అనిపిచ్చింది. చదువు వల్ల జీవిత కాన్వాస్ ఎంత అందంగా మారుతదో గురువుల దగ్గర తెలుసుకున్నప్పటి సంది సదువును అస్సలు వదల్లేదు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన. ఇక ఆలోచించలేదు.

పీజీలో చేరిన. గోల్డ్ మెడల్ సాధించిన. ఆ రోజు పేపర్ల నా ఫోటో వేసినప్పుడు ఊరు ఊరంతా ముక్కున వేలేసుకుంది. అప్పటికి మా ఊర్లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తిని నేనే! ఊర్లో ఎవరైనా సరే సదువుకుంటే మురళి గాని లెక్కయితరని చెప్పుకుంటాంటె చదువు ఇచ్చిన గౌరవం ముందు ఐదెకరాల భూమి విలువ చిన్నగ అనిపిచ్చింది. ‘గొర్రెల కాపరి కొడుక్కి గోల్డ్ మెడల్’ అని పత్రికలల్ల సదివినప్పుడు మనల్ని ఈ సమాజం ఎట్ల గుర్తుపెట్టుకుంటుందో ఇంకాస్త బాగా అర్థమైంది.నా కథ తెలిసిన మిత్రులు ‘రాస్తే పెద్ద నవల ఐతదిరా..’ అనేటోల్లు. అండ్ల ఒక్కలు మాత్రం ‘‘ఇప్పటి సంది నీ కథ ముగింపు వరకు నేనూ భాగమవ్వాలనుకుంటున్న’’ అన్నది. నన్ను నేను నమ్మలేదు. ‘‘అందగాడిని కాదు.

సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు మాకు లేవు. ఇది కుదరదు. నా కథలో నువ్వు ఒక మలుపు మాత్రమే!’’ స్పష్టంగా వివరించిన. ‘‘నచ్చిన వాడితో, జీవితం తెలిసిన వాడితో కలిసి బతకడం కన్నా గౌరవ మర్యాదలు వేరే ఉండవు. సమాజం గురించి నీ అంత తెలియకపోయినా కథలో కేవలం మలుపుగా మాత్రం మిగిలిపోదల్చుకోలేదు. ఇద్దరికీ ఒక హ్యాపీ ఎండింగ్ మాత్రం ఉంటుందనుకుంటున్న” నాకన్నా స్పష్టంగా చెప్పింది. ‘‘ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టున్నవ్” ఆమె భుజం తట్టింది.‘‘ఈ కుర్చీలు సరిపోతయా? ఇంకొన్ని తెప్పించమంటవా’’ వేదికను సూపిచ్చుకుంట అడిగింది.‘‘హా.. సరిపోతాయిలే’’‘‘ఓకే..మరి! ఇంకెవలన్న వచ్చేటోళ్ళు ఉంటే ఫోన్ చేసి జెప్పు” వేదిక మీదికి వెళ్తూ చెప్పింది.తను అపర్ణ.

డిగ్రీ నుంచి జిగిరి దోస్త్ . తన కుటుంబాన్ని ఒప్పిచ్చి మరీ నన్ను పెళ్లి జేసుకున్నది. ఎంఏ అయ్యాక యుజిసి నెట్ రాసి ఇద్దరం పాస్ అయినం. గట్టిగనే ప్రిపేర్ అయ్యి డి.యల్. కొట్టినం. ఇప్పుడు ఇద్దరమూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. తను పొలిటికల్ సైన్స్, నేను తెలుగు. ఇప్పుడు మాకు ఇద్దరమ్మాయిలు. హ్యాపీ ఫ్యామిలీ. అమ్మానాయిన అప్పుడప్పుడు వచ్చి సూశి పోతుంటరు. నా కాన్నే వుండుమంటె ఊరిడ్శి రానంటరు. మేము సుత మా ఊరికి పోయి వస్తం. అపర్ణ వాళ్ళదైతే అంతా ఇక్కన్నే. అమ్మానాయినల్ని మంచిగ అర్సుకుంటది. ఆమెకు మొదటి నుంచి సోషల్ వర్క్ చేయడం అలవాటు.

మా పరిచయం సుత అట్లనే జరిగింది. డిగ్రీలో వున్నప్పటి సంది తనను దగ్గర నుండి సూత్తాన. పేద పిల్లలకు పుస్తకాలు పంచేది. వీధి బాలల కోసం విరాళాలు సేకరించేది. సేవా కార్యక్రమాలు చాలానే చేస్తుండేది. తన తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే! ఆర్థికంగా ఇబ్బందులేవీ లేవు. చిన్నప్పటి సంది తనను స్వతంత్రంగా వుండేలా పెంచిండ్లు.
 

 *   *   *

‘‘మురళీ.. బ్యానర్ అక్కడి వరకు కనిపిస్తుందా?” గొంతు పెంచి అడిగింది.‘‘ఆ..ఓకే!’’ఆశా ఫౌండేషన్ – తన కష్టానికి ప్రతిరూపం. చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని, అనాధ పిల్లల్ని చేరదీసి సదివిత్తాంది. ఒత్తిడి లేని చదువు గురించి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తంది. ఇండ్ల ఫేమస్ సైకాలజిస్టులు, మేధావులు మాట్లాడతరు.ఈ రోజుల్లో మార్కులు రాలేదని, సరిగా చదవలేదని ఆత్మహత్య చేసుకోవడం సాధారణమైంది. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం ఎగబడే పిల్లల్ని, అందుకు పురిగొలుపుతున్న తల్లిదండ్రులని ఒక వేదిక మీదికి తీసుకొచ్చి వాళ్ల ఆలోచనల్లో మార్పును ఆశించడమే ఇవ్వాల్టి కార్యక్రమ ఉద్దేశం.

అందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తనే చూసుకుంటాంది అపర్ణ. నాది ప్రేక్షక పాత్ర. అత్యవసరం అనుకుంటే తప్ప నా సాయం అడుగదు. భాగస్వామ్యం తీసుకుంటే మాత్రం కాదనదు. ఇప్పుడు తన కథలో నేను భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.‘‘ఐయాం కార్డియల్లీ ఇన్వైటింగ్ హానరబుల్..’’ కార్యక్రమం మొదలైంది. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడకపోతే, ముందుకు సాగకపోతే జీవితమే ఉండదు’’ నాకు అనుభవం నేర్పిన పాఠమిది.

బండారి రాజ్ కుమార్ 

ఫోన్​: 8919556560