- సిద్దిపేట జిల్లా ఉంటది
- పొన్నం ప్రభాకర్ స్పష్టం
హుస్నాబాద్, (వెలుగు) : హుస్నాబాద్ ప్రజల కల త్వరలోనే నెరవేరనుందని, కరీంనగర్ జిల్లాలో తిరిగి కలుపుడు ఖాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల విభజనపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు శనివారం మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం బలవంతంగా హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపిందని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ గా హుస్నాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఉంటదని, రాజకీయ లబ్ధి కోసం చేసే వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు.
హుస్నాబాద్‌ను 'ఉత్తర తెలంగాణ కోనసీమ'గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతకుముందు హుస్నాబాద్ లో వివిధ శాఖల పురోగతిపై సమీక్షించారు. రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదని, రైతు వేదికలు, సహకార సంఘాలు, మహిళా సంఘాల ద్వారా పంపిణీ జరిగేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి పాడి గేదె ఉండేలా ప్రణాళిక రూపొందించాలని, పశువులకు టీకాలు పూర్తి చేయాలని, సంతానోత్పత్తి పెంచేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
