గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
  •     235 గ్రాముల గంజాయి, కారు, 
  •     ఆరు సెల్ ఫోన్లు సీజ్

హుజూర్ నగర్, వెలుగు : గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను హుజూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్ నగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చరమందరాజు నిందితుల వివరాలు వెల్లడించారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వీరమల్ల ఉపేందర్,షేక్ రజి ఆఫ్రోజ్,షేక్ యాసిర్, బత్తిని ఉమేశ్, మీసాల గోపి, చిల్ల వికాస్, సయ్యద్ రహమద్ బాబా అలియాస్ సొహైల్,షేక్ బాల సైదా అలియాస్ తుఫాన్ సైదాలు ముఠాగా ఏర్పడి గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారు. వీరంతా ఏపీ స్టేట్ లోని అరకు వెళ్లి గంజాయి తేవాలని నిర్ణయించుకున్నారు.

ఈ గ్యాంగ్​లోని షేక్ రజి ఆఫ్రోజ్.. నూకపంగు రాజు వద్దకు వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ తో కారు అద్దెకు తీసుకొని గత నెల 25న అరకు వెళ్లారు. అక్కడ రూ.20 వేలు చెల్లించి ఓ వ్యక్తి వద్ద 5 కేజీల గంజాయి కొనుగోలు చేశాడు. తిరిగి 27న హుజూర్ నగర్ కు వచ్చాడు. సయ్యద్ రహమద్ బాబా తన మిత్రులైన ఉపేందర్, చిల్ల వికాస్, షేక్ రజి అఫ్రోజ్, మీసాల గోపికి పిలిచి కొంత గంజాయి ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన మిత్రులు మంగళవారం పట్టణ పొలిమేరలోని కాటమయ్య గుడి వెనుకల ఉన్న నిర్మానుష ప్రదేశంలో  తమ దగ్గర ఉన్న గంజాయిని షేక్ యాసిర్, బత్తిని ఉమేశ్​కు విక్రయిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో దాడులు చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయి, కారు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులు సయ్యద్ రహమద్ బాబా అలియాస్ సొహైల్,షేక్ బాల సైదా అలియాస్ తుఫాన్ సైదాను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్ఐ ముత్తయ్య, ఏఎస్ఐ బలరాంరెడ్డి, నాగరాజు, శంబయ్య, వెంకన్న పాల్గొన్నారు.