రంగనాయకసాగర్‌‌లో  హుజూరాబాద్‌‌ పాలిటిక్స్‌‌

రంగనాయకసాగర్‌‌లో  హుజూరాబాద్‌‌ పాలిటిక్స్‌‌

ఐలాండ్‌‌ గెస్ట్‌‌ హౌస్‌‌లో విందు రాజకీయాలు

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక రాజకీయాలకు సిద్దిపేట దగ్గర్లోని రంగనాయకసాగర్‌‌ ఐలాండ్‌‌ గెస్ట్‌‌ హౌస్‌‌ వేదికైంది. ఉప ఎన్నిక వ్యవహారాలను మంత్రి హరీశ్‌‌రావు అక్కడి నుంచే మానిటరింగ్‌‌ చేస్తున్నారు. హుజూరాబాద్‌‌ స్థానిక నాయకులు, కుల సంఘాలు, వివిధ సంస్థల ప్రతినిధులను ప్రతిరోజూ రంగనాయకసాగర్‌‌కు రప్పించడం, వారి డిమాండ్లపై అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారు. ఒక్కో రోజు 5 నుంచి 10 వెహికల్స్‌‌లో హుజూరాబాద్‌‌ నియోజకవర్గానికి చెందిన వారు రంగనాయకసాగర్‌‌కు వస్తున్నారు. రిజర్వాయర్‌‌ మధ్యలోని ఐలాండ్‌‌లో వారు సేద తీరడం, సిద్దిపేటకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు వారి మంచిచెడ్డలు చూసుకోవడం రోజూ జరుగుతోంది.
హరీశ్‌‌ అన్నీ తానై..
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌‌ అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని టీఆర్‌‌ఎస్‌‌ ఎత్తులు వేస్తోంది. ఉప ఎన్నిక వ్యవహారాలను మంత్రి హరీశ్‌‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్‌‌, కొప్పుల ఈశ్వర్‌‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు గ్రౌండ్‌‌లో క్యాడర్‌‌తో కలిసి పనిచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు వివిధ సంఘాల ప్రజలను టీఆర్‌‌ఎస్‌‌ వైపు ఆకర్షించే బాధ్యతను హరీశ్‌‌ భుజాలకెత్తుకున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ లోకల్ లీడర్లు, కుల సంఘాలు, ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మొదట్లో సిద్దిపేటలోని తన నివాసంలోనే హుజూరాబాద్‌‌ బైపోల్‌‌ వ్యవహారాలను పర్యవేక్షించిన హరీశ్‌‌.. కొంతకాలం క్రితం వేదికను రంగనాయకసాగర్‌‌ గెస్ట్‌‌ హౌస్‌‌కు మర్చారు. రిజర్వాయర్‌‌ మధ్యలోని ఐలాండ్‌‌ మంచి టూరిస్ట్‌‌ స్పాట్‌‌ కావడంతో అక్కడికి వచ్చే నేతలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆతిథ్యం ఇస్తున్నారు. భోజనాలు, సైట్‌‌ సీయింగ్‌‌ అయిన తర్వాత వారితో మంత్రి హరీశ్‌‌ భేటీ అవుతున్నారు.
మంత్రి కనుసన్నల్లోనే..
కుల సంఘాలు, వివిధ క్లబ్‌‌ల ప్రతినిధుల డిమాండ్లేంటో తెలుసుకుని హరీశ్‌‌రావు హామీలిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌‌, జమ్మికుంట పట్టణాల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి భూమి కేటాయించగా, హుజూరాబాద్‌‌లో మంత్రి గంగుల ఆదివారం భూమి పూజ చేశారు. ఇతర సంఘాల అవసరాలను అప్పటికప్పుడు తీర్చడమో, కొద్దిరోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇవ్వడమో చేస్తున్నారు. గీత కార్మికులకు త్వరలోనే మోపెడ్‌‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు. మిగతా హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చుతామని హరీశ్‌‌ చెబుతున్నారు.