
- 25 మీటర్ల మేర మట్టిని నింపి అక్రమ వ్యాపారాలు
- డైలీ రూ.3 లక్షల వరకు వసూల్
- ఫిర్యాదులు రావడంతో ఆక్రమణలకు చెక్ పెట్టిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ నది గర్భంలో 20 నుంచి -25 మీటర్ల మేర మట్టిని నింపి చేస్తున్న అక్రమ వ్యాపారాలకు హైడ్రా అడ్డుకట్ట వేసింది. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా
హాస్పిటల్ మార్చురీ వరకు ఉన్న ఆక్రమణలను మంగళవారం తొలగించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గ్రౌండ్లోకి దిగి, 9.62 ఎకరాల భూమిని కాపాడింది. అక్కడే షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది.
కోర్టు ధిక్కరణ కేసులున్నా కొనసాగిన కబ్జాలు
మూసీలో మట్టిని నింపి తికారం సింగ్ 3.10 ఎకరాలు, పూనమ్ చాంద్ యాదవ్ 1.30 ఎకరాలు, జయకృష్ణ 5.22 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిపై కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు గతంలోనే కన్నెర్రజేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు అప్పటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు కూడా పెట్టారు. ఇలా కోర్టు ధిక్కరణతో పాటు పోలీసు కేసులకు వెరవకుండా కబ్జాల పర్వం కొనసాగించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రధానంగా వాడారు. పండ్లను నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేశారు. నర్సరీని కొంతమేర పెంచి వ్యాపార దందా కొనసాగిస్తున్నారు. అక్కడ కార్యాలయాల నిమిత్తం చిన్న షెడ్డులు కూడా నిర్మించారు.
ఒక్కో వాహనానికి రోజుకు రూ. 300 వరకు వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. నదీ గర్భంలోకి ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేయడమే కాకుండా.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ఆక్రమించిన భూమి మొత్తానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ పార్కింగ్ ద్వారా డైలీ రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలిసింది.
మూసీ సుందరీకరణతో సంబంధం లేదు
అయితే మూసీ సుందరీకరణ పనులతో హైడ్రాకు సంబంధం లేదని అధికారులు తెలిపారు. నదిలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడం వరకే తమ బాధ్యతని, మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకోవడంపైనే చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ సుందరీకరణ.. అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం అవ్వడం లేదన్నారు. ఇక్కడ పోసిన మట్టిని తొలగించాలని నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఓఆర్ ఆర్ పరిధిలో నాలాలు, చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాలను తొలగించిన మాదిరే మూసీ నదిలో ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.