కౌన్సిల్ తర్వాత కదలిక .. వర్కింగ్ స్టైల్ మార్చిన హైదరాబాద్ బల్దియా ఆఫీసర్లు

కౌన్సిల్ తర్వాత కదలిక .. వర్కింగ్ స్టైల్ మార్చిన హైదరాబాద్ బల్దియా ఆఫీసర్లు
  • మీటింగ్ లో సభ్యుల నిలదీతతో దిద్దుబాటు చర్యలు  
  • వెంటనే సాల్వ్ చేయాలని కమిషనర్ ఆదేశాలు
  • కార్పొరేటర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు 
  •  సర్కిల్, జోనల్ స్థాయిలో రివ్యూలకు నిర్ణయం
  • ఇన్నాళ్లు కేటీఆర్ కనుసైగల్లో పనిచేసిన సిబ్బంది
  • సర్కార్ మారడంతో పని విధానంలోనూ మార్పు  

హైదరాబాద్, వెలుగు:  బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత అధికారుల్లో కదలిక వస్తుంది. మూడు రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో సిటీలోని సమస్యలపై ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని కార్పొరేటర్లు నిలదీశారు. ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఆఫీసుల్లో కూర్చుంటే పనులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. శానిటేషన్, అడ్వటైజ్ మెంట్, ఎలక్ర్టికల్, స్పోర్ట్స్ తదితర సమస్యలపై అన్ని పార్టీల కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా వారిపై అసహనం వ్యక్తం చేశారు.

కోట్లు ఖర్చు చేస్తున్నా కూడా రోడ్లపై చెత్త అలాగే ఉంటుందని, ఏ గ్రౌండ్ కి వెళ్లినా స్పోర్ట్స్ మెటీరియల్స్, కోచ్ లు లేరని, స్ర్టీట్ లైట్లు వెలగడంలేదని, కొత్త వైర్లు వేయడం లేదని, అడ్వటైజ్ మెంట్ పై వచ్చే ఆదాయానికి అధికారులు గండికొడుతున్నారని విమర్శించారు. రెండు రోజులు నిర్వహించిన మీటింగ్ లో ఆఫీసర్ల పనితీరుపై మెజార్టీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో మరుసటి రోజునే కమిషనర్ రోనాల్డ్ రాస్ అప్రమత్తం అయ్యారు. 

శానిటేషన్ పై రివ్యూ

కౌన్సిల్ లో సభ్యులు లేవనెత్తిన అంశాలపై కమిషనర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ముందుగా శానిటేషన్ పై రివ్యూ నిర్వహించారు.  ఎక్కడా సమస్యలు లేకుండా ఉండేందుకు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు.  ఆ తర్వాత ఓల్డ్ సిటీలోని పలు నాలాలను కమిషనర్ పరిశీలించారు.  స్పోర్ట్స్ గ్రౌండ్ లను తనిఖీ చేసి స్విమ్మింగ్ పూల్ మరమ్మతులతో పాటు  తదితర సామగ్రిని అందుబాటులో ఉంచాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. ఇలా పలు సమస్యలపై కమిషనర్ ఫోకస్ చేయడమే కాకుండా జోనల్, సర్కిల్ స్థాయి అధికారుల పనితీరుపైనా నిఘా పెంచారు. 

కార్పొరేటర్లతో కలిసి వెళ్లండి..

డివిజన్లలో తమను అధికారులు పట్టించుకోవడంలేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ లో చెబుదామంటే ఫోన్లు కూడా ఎత్తడంలేదని, కుక్కల్లా చూస్తున్నారని కౌన్సిల్ మీటింగ్ లో ఆఫీసర్ల తీరుపై కార్పొరేటర్లు మండిపడ్డారు. దీనిపై మేయర్ కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని, కార్పొరేటర్ల ఫోన్లు లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది ఏంటి..? అని ప్రశ్నిస్తూ అధికారులను నిలదీశారు.

సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు వెంటనే ప్రజా సమస్యలపై కార్పొరేటర్లతో కలిసి పని చేయాలని ఇప్పటికే కమిషనర్ ఆదేశించారు. వర్కింగ్ స్టైల్ తో పాటు ప్రజల ఇబ్బందులను కూడా క్షేత్రస్థాయిలో చూడాలని సూచించారు. సర్కిల్, జోనల్ స్థాయిలో రివ్యూలు నిర్వహిస్తూ..త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  జరిగిన తొలి కౌన్సిల్ మీటింగ్ తర్వాత అధికారుల్లో మార్పు వస్తుంది. 

 మంత్రి కనుసన్నల్లోనే అంతా నడిచేది.. 

గత బీఆర్ఎస్ పాలనలో బల్దియా అధికారులు మున్సిపల్ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే పని చేసేవారు. ఎలాంటి మీటింగైనా ఆయన సమక్షంలోనే జరిగేవి. ఉన్నతాధికారులు కూడా కిందిస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు కాదు. దీంతో ఎలాంటి మీటింగ్ లు సొంతంగా నిర్వహించలేకపోయారు.  మంత్రి అనుమతి లేకుండా ఏ పనులైనా జరిగేవి కాదు.

కనీసం కేటీఆర్ ట్విట్టర్ లోనైనా ఆదేశిస్తేనే పనులు అయ్యేవి.  జనం తమ  ఫిర్యాదులను కేటీఆర్ ట్విట్టర్ కు పోస్టు చేయగా. వాటిని సంబంధిత అధికారులకు ట్యాగ్ చేసి ఆదేశించేవారు. ఆ సమయంలో మాత్రమే ఉన్నతాధికారులు మీటింగ్ నిర్వహించేవారు. ఇలా... అంతా మున్సిపల్ మంత్రి కనుసైగల్లోనే పని చేయగా.. ఇప్పుడా పరిస్థితులు కనిపించడంలేదు.  ప్రస్తుతం చేయాల్సిన పనుల నుంచి మొదలు కొని సమావేశాల వరకు అధికారుల వర్కింగ్ స్టైల్ మారింది.  అప్పట్లో నోరు విప్పని అధికారులు కూడా ప్రస్తుతం  స్వేచ్ఛగా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతుంది.