హైదరాబాద్ లో కారు దిగుతున్నరు!

హైదరాబాద్ లో కారు దిగుతున్నరు!
  •     సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న గ్రేటర్ గులాబీ నేతలు  
  •     నియోజకవర్గ, డివిజన్ స్థాయి లీడర్లపైన కాంగ్రెస్ ఫోకస్
  •     ఇప్పటికే వరుసగా పార్టీ మారుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు : సిటీలో గులాబీ పార్టీ నేతలు కారు దిగుతున్నారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది.  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్టీ లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పవర్ లో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని, ఓడిపోయినా కూడా వారిలో అహంకారం తగ్గలేదని పార్టీ మారుతున్న నేతలు, మారేందుకు సిద్ధంగా ఉన్నవారు చెబుతున్నారు. మరోవైపు కార్పొరేటర్లు, డివిజన్ల ప్రెసిడెంట్లు, నియోజకవర్గ స్థాయి నేతలపైన కాంగ్రెస్​ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే బీఆర్ఎస్​లోంచి 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు. ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ హస్తం అందుకున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన కూడా చేరనున్నారు. తాజాగా మంగళవారం బల్దియా  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్​లో చేరనున్నట్లు వారు ప్రకటించారు. అదే విధంగా మరో 25 మంది కార్పొరేటర్లు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నది. కార్పొరేటర్లతో పాటు డివిజన్, నియోజకవర్గ స్థాయి గులాబీ పార్టీ నేతలు జంప్ అయితారనే  చర్చ కూడా నడుస్తున్నది.  

పట్టించుకోకపోవడంతోనే జంప్..

పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్​తమను పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలోనే కార్పొరేటర్లను, కిందిస్థాయి లీడర్లను వాడుకొని వదిలేసిందని అదే పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, కిందిస్థాయి నేతలు  ఆరోపిస్తున్నారు. తాము పనిచేస్తేనే  గ్రేటర్ లో ఇన్ని సీట్లు వచ్చాయని కూడా సన్నిహితుల వద్ద చెబుతున్నారు.  అయినా.. తమను పట్టించుకోకపోవడంతోనే పార్టీ మారేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్​లో చేరితే సెగ్మెంట్ పరిధిలో పార్టీని డెవలప్ చేస్తే భవిష్యత్ లో తమకు ఏవైనా చాన్స్ రావచ్చనే  ఆలోచనతో కూడా పార్టీ మారుతున్నారు. వచ్చే రెండేండ్లలో మళ్లీ  గ్రేటర్ కు ఎన్నికలు జరుగుతాయి.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రేటర్ పీఠం కూడా ఆ పార్టీకి దక్కే చాన్స్ ఉంటుంది. అప్పుడు మరోసారి కార్పొరేటర్ గా గెలుపొందవచ్చని కూడా కొందరు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. 

బల్దియా కుర్చీ కోల్పోయే చాన్స్

మూడేండ్ల కిందట జరిగిన బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి 56 , బీజేపీ నుంచి 48 , ఎంఐఎం నుంచి 44,  కాంగ్రెస్​నుంచి ఇద్దరు కార్పొరేటర్ల చొప్పున గెలుపొందారు. ఇందులో ప్రమాణ స్వీకారానికి ముందే బీజేపీ లింగోజీగూడ కార్పొరేటర్ మరణించాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచింది. దీంతో బీజేపీకి 47, కాంగ్రెస్​కార్పొరేటర్ల సంఖ్య 3 చేరింది.  

అనంతరం ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా వారు అటు ఇటు పార్టీలు మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్​కు 55 మంది ఉన్నారు. ఎంఐఎంకు 44 , బీజేపీ కి 40 , కాంగ్రెస్​కు 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఏడాది కిందట మరణించగా.. అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్ఎస్​కు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీలోంచి బీఆర్ఎస్​లో చేరగా బీఆర్ఎస్​బలం 62 ఉండగా.. ప్రస్తుతం 55 కి చేరింది. మరో 25 మంది కార్పొరేటర్లు త్వరలో కాంగ్రెస్​ లో చేరే చాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే జరిగితే ఎంఐఎం మద్దతులో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే చాన్స్ ఉంటుంది. చేరికల తర్వాత సిటీలో భారీ సభ పెట్టాలని కూడా కాంగ్రెస్  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Also Read : మేడిగడ్డకు పీకనీకిపోయినవా? .. సీఎం రేవంత్​పై కేసీఆర్ వ్యాఖ్యలు