గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే

గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే

తేల్చిన సీసీఎంబీ, ఐఎం టెక్నాలజీ సైంటిస్టులు 
కరోనా అంతరించిపోలేదని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : కరోనా వైరస్ గాలి ద్వారా మనుషులకు సోకడం నిజమేనని హైదరాబాద్ సీసీఎంబీ, చంఢీగడ్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. గతంలో సర్ఫేస్(ఉపరితలాల) ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని భావించినా.. తాజాగా  గాలి ద్వారానూ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.  ఈ పరిశోధనకు సంబంధించిన రిపోర్ట్ ది జర్నల్ ఆఫ్ ఏరోసోల్ సైన్స్ లో మంగళవారం పబ్లిష్ అయ్యింది. ప్రయోగంలో  భాగంగా కరోనా పేషెంట్లు ఎక్కువగా ఉన్న ఆసుపత్రులు , కరోనా బాధితులు తక్కువ సమయం గడిపిన రూమ్ లు, హోం ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ల ఇళ్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు.   ఐసీయూ, నాన్ ఐసీయూ విభాగాల్లోనూ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. పేషెంట్ల చుట్టూ ఉన్న గాలిలో వైరస్ ఉన్నట్లు తెలిపారు.  రోగులు  దగ్గడం, తుమ్మడం ద్వారా గాలిలోకి వైరస్ ప్రవేశించిందని నిర్ధారించారు. కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, ప్రతిఒక్కరూ ఫేస్ మాస్క్ లు ధరించాలని వారు సూచించారు. 

అప్రమత్తంగా ఉండేందుకే  ప్రయోగం
వెంటిలేషన్ లేని గదుల్లోనూ వైరస్ కొంత సమయం గాలిలో ఉండగలదని శాస్త్రవేత్త డాక్టర్ శివరంజని మొహరిర్ చెప్పారు. ఒక గదిలో ఇద్దరికంటే ఎక్కువ పేషెంట్లు ఉన్నప్పుడు గాలిలో వైరస్ పాజిటివిటీ 75% ఉన్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా ప్రజలు సాధారణ జీవనం సాగిస్తున్నందునా.. మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్​ మిశ్రా పేర్కొన్నారు.