స్లోగా ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టు పనులు

  స్లోగా ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టు పనులు

హైదరాబాద్ సిటీ రోడ్లు అస్థవ్యస్థంగా ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల రిపేర్లు, ఫ్లై ఓవర్లు, స్కైవేల పనులు ఏళ్లకేళ్లుగా నడుస్తుండటంతో జనానికి నరకం కన్పిస్తోంది. వరంగల్ హైవే ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడక నడుస్తున్నాయి. రోడ్లు తవ్వి మళ్లీ పూడ్చకపోవడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్ లో స్కైవాక్ పనులతో ఆ రూట్లో వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో మెట్రో పనులతో జనం కొన్నేళ్లపాటు దుమ్ము ధూళితో అవస్థలు పడ్డారు. ఇప్పుడు వివిధ రూట్లలో కడుతున్న ఫ్లైఓవర్లతో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పది నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా పడుతోంది. గుంతల రోడ్లతో వెహికిల్స్ ఎత్తేస్తుండగా.... దుమ్ముతో రోగాల బారిన పడుతున్నారు సిటీ జనం. ఏడాదిలో పూర్తయ్యే ఫైఓవర్స్ ని రెండు మూడేళ్ళు... రెండేళ్లని చెప్పిన చోట నాలుగేళ్ళయినా..సగం పనులు కూడా పూర్తిచేయట్లేదు. నాగోల్ వైపు ఫ్లైఓవర్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఫ్లైఓవర్ కోసం రోడ్లు తవ్వి పెట్టారు. ముందుగానే రోడ్లు తవ్వి పనులు చేయకుండా ఎందుకు వదిలేశారని జనం ఫైర్ అవుతున్నారు.

ఉప్పల్ క్రాస్ రోడ్డులో స్కై వాక్ పేరుతో 30 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నప్రాజెక్ట్  పనులు స్లోగా నడుస్తున్నాయి. జంక్షన్ లో 4 వైపులా వెళ్లేవారు రోడ్డు దాటేందుకు వీలుగా ఈ స్కైవే కి ప్లాన్ చేసిన GHMC... పనులను మాత్రం స్పీడప్ చేయలేకపోయింది. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు 2018 జూన్ లో మొదలవగా... రెండేళ్లల్లో అవ్వాల్సినవి... నాలుగేళ్ళయినా పట్టించుకోలేదు. ప్రాజెక్ట్ పనులు డెడ్ స్లోగా నడుస్తుండటంతో.. ఉప్పల్, పీర్జాది గూడ, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి వచ్చి వెళ్లే వేల మంది ప్రయాణీకులకు నరకం కనిపిస్తోంది. ఇక్కడ పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉండగా... రోడ్లను మాత్రం 150 ఫీట్లు తవ్వడంతో దుమ్ము లేస్తోందని జనం చెబుతున్నారు. 

బడ్జెట్ ప్లాన్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా అన్ని  ఫ్లైఓవర్స్ ఒకేసారి మొదలుపెట్టడమేంటని పొలిటికల్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులివ్వకపోవడంతో పనులు లేట్ అవుతున్నాయనీ... మధ్యలో జనం ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి జనం ఉండే చోట పనులు ఆలస్యం చేస్తున్నారనీ... ధనికుల ఏరియాల్లో స్పీడ్ గా జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.. ముందు చూపు లేకుండా ఆర్భాటాలకు పోయి అన్ని ఫ్లైఓవర్లు, స్కైవేల పనులు ఒకేసారి మొదలు పెట్టడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని జనం మండిపడుతున్నారు.  తమ బాధలు ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.