
- పరీక్షలు చేశారా?
- పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మనుషుల ఆరోగ్యంపై హుక్కా ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అంశంపై ఏవైనా పరీక్షలు నిర్వహించి ఉంటే వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ వ్యాపార కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ మాదాపూర్‌లోని స్మోకీ టేల్స్ కేఫ్ అండ్ గ్రిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..తమ వ్యాపార కార్యకలాపాల్లో మాదాపూర్ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారన్నారు.
సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహించడం లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి..హుక్కా వినియోగం మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా లేదా అని పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. అదనపు ప్రభుత్వ న్యాయవాది ఎం.శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించినట్లు తన దృష్టికి రాలేదని, వివరాలు తెలుసుకుని చెబుతాననడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.