
రూ.900 కోట్లు శాంక్షన్.. తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
సంగారెడ్డి, వెలుగు : హైదరాబాద్-–పూణే మధ్య సంగారెడ్డి జిల్లాలో 65వ నంబర్ జాతీయ రహదారిని ఇక ఆరు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. మొదటి విడత రంగారెడ్డి జిల్లా మదీనాగూడ నుంచి సంగారెడ్డి క్రాస్‌రోడ్డు వరకు రహదారి విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2022–-23 వార్షిక ప్రణాళికలో రూ.900 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యత మెస్సర్స్ జేసీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు రోడ్లు, భవనాల శాఖ హైవే విభాగం అధికారులు తెలిపారు.
హైవే విస్తరణ పనులపై ఇటీవల హైవే అథారిటీ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కు లేఖ అందినట్టు రోడ్లు, భవనాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రహదారికి 161వ అకోలా–-నాందేడ్ మరో నేషనల్ హైవే జోగిపేటకు లింక్ గా ఉంటుంది. మరోవైపు సంగారెడ్డి చౌరస్తా దాటిన తరువాత పెద్దాపూర్ సమీపంలో హైవే 65 మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానున్నది. దీంతో రద్దీ మరింత పెరిగి హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు డివైడర్‌తో కలిసి 200 ఫీట్ల వెడల్పు ఉన్న నాలుగు లైన్ల రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల చొప్పున విస్తరించి ఆరు లైన్ల రహదారిగా చేయనున్నారు.
నిర్మాణాల తొలగింపునకు చర్యలు..
లింగంపల్లి నుంచి సంగారెడ్డి ఎక్స్ రోడ్ వరకు విస్తరించనున్న ఈ నేషనల్ హైవే కు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపునకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. మదీనాగూడ నుంచి లింగంపల్లి వరకు ఇప్పటికే నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 35 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే విస్తరించనున్న నేపథ్యంలో సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి లింగంపల్లి వరకు నిర్మాణాల తొలగింపు ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.
పటాన్ చెరు హైవే పరిధిలో ఉన్న తాత్కాలిక దుకాణాల యజమానులకు ఇప్పటికే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నేతృత్వంలో నచ్చజెప్పి ఒప్పించినట్టు ఆయన వర్గీయులు తెలిపారు. సంగారెడ్డి చౌరస్తా, కంది, గణేశ్‌గడ్డ, రుద్రారం, లక్డారం, ఇస్నాపూర్, ముత్తంగి పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారవర్గాలు హైవే విస్తరణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల పరిధిలో త్వరలో హైవే విస్తరణ పనులు మొదలు కానున్నాయి.