
- త్వరలో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో త్వరలో ప్యాండమిక్ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిపాలన కోసం హరిహర కళాభవన్‌ను జీహెచ్ఎంసీ సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ల్యాబ్ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో తొలి దశగా కేంద్రం 25 శాతం (రూ. 81.35 లక్షలు) నిధులను ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసింది. వీలైనంత త్వరగా ఈ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది.
పబ్లిక్ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ తో పాటు మొత్తం 17 విభాగాల సేవలను అందించేలా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. 28 మంది టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. ల్యాబ్ ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని కేంద్రం భరిస్తుండగా, సిబ్బంది జీతభత్యాలను జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాటాలుగా చెల్లించనున్నట్లు సమాచారం.
వైరల్ వ్యాధులు, ఆహారం, నీరు, గాలి కలుషితం కారణాలను ఈ ల్యాబ్ పరిశీలించి, వ్యాధి వ్యాప్తి సామర్థ్యాన్ని ముందుగా అంచనా వేస్తుంది. ప్రస్తుతం నాచారంలోని ఎన్ఐఎన్కు పంపే ఆహార శాంపిళ్ల పరీక్షలు ఇకపై ఈ ల్యాబ్‌లో త్వరితగతిన నిర్వహించి, ప్రజారోగ్య పరిరక్షణకు సిఫార్సులు చేయనున్నారు. ఈ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వ మెట్రో సర్వైలెన్స్ యూనిట్లో భాగంగా ఏర్పాటవుతోంది.