జీహెచ్ఎంసీలో ట్రాన్స్​జెండర్లకు ఉద్యోగాలు!

జీహెచ్ఎంసీలో ట్రాన్స్​జెండర్లకు ఉద్యోగాలు!
  • ఉపాధి పొందడానికి ట్రైనింగ్​ కూడా..  విద్యార్హతలు, స్కిల్స్ ఆధారంగా జాబ్స్​
  • సెక్యూరిటీ గార్డ్స్, గ్రీన్ మార్షల్స్ మరెన్నో  
  • క్వాలిఫికేషన్​ లేకుంటే సెల్ఫ్​హెల్ప్​గ్రూపులుగా ఏర్పాటు 
  • ఇప్పటికే మూడు గ్రూపులకు బ్యాంకు లింకేజీ  
  • ట్రాన్స్​జెండర్ల ప్రతినిధులతో చర్చించిన అడిషనల్ కమిషనర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రాన్స్​జెండర్లకు ఇప్పటికే నగరంలో ట్రాఫిక్​వలంటీర్లుగా ఉద్యోగావకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత చేయూత ఇచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వారికి జీహెచ్ఎంసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీశ్, చంద్ర కాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం బల్దియా హెడ్ ఆఫీసులో ట్రాన్స్ జెండర్ల ప్రతినిధులు, ఎన్జీఓలతో అర్బన్​కమ్యూనిటీ డెవలప్ మెంట్(యూసీడీ) విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ల సేవలను జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై వారి సూచనలు, సలహాలు తెలుసుకుని అభిప్రాయాలు తీసుకున్నారు. 

స్నేహ శబరీశ్​మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల ఆసక్తి, అర్హతల మేరకు బల్దియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగమే కాకుండా ఉపాధి పొందడానికి  ట్రైనింగ్​కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. చంద్రకాంత్​రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీలో  ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని,  వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 

వారి  విద్యార్హతలు, నైపుణ్యం, ఆసక్తి మేరకు అనువైన రంగాన్ని ఎంచుకోవాలని, దానికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగ అవకాశాలకు అర్హత లేని ట్రాన్స్ జెండర్లను స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతామన్నారు. ఇప్పటికే మూడు ట్రాన్స్ జెండర్ల  ఎస్ హెచ్ జీ గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజీ లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరిన్ని  గ్రూప్ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారు  ముందుకు రావాలన్నారు. 

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, క్లీన్ డ్రైవ్ అమలులో గ్రీన్ మార్షల్స్ గా, పార్కులు, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద, మైదానాల వద్ద సెక్యూరిటీ గార్డులుగా , మెట్రో స్టేషన్లలోనూ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే, అమృత్ స్కీం కింద నీటి నాణ్యత పరీక్షల్లో సహకారం అందించడానికి, శిక్షణ తర్వాత స్ట్రీట్ లైట్ల నిర్వహణ చూడడానికి, బస్తీ దవాఖానాలలో పారా మెడికల్ సిబ్బందిగా అవకాశాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ యాదగిరి రావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, హార్టికల్చర్ ఆఫీసర్ సునంద పాల్గొన్నారు.