ట్రాఫిక్, ముంపు సమస్యలపై హైడ్రా ఫోకస్

ట్రాఫిక్, ముంపు సమస్యలపై హైడ్రా ఫోకస్
  • లక్డీకాపూల్, రాజ్​భవన్​ రోడ్డులో కమిషనర్​ రంగనాథ్ పర్యటన 
  •  అధికారులకు పలు సూచనలు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో వరద నీరు నిలుస్తున్న, ట్రాఫిక్​స్తంభిస్తున్న ప్రాంతాల‌ను హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్, సిటీ ట్రాఫిక్ అడిషనల్​కమిషనర్ విశ్వప్రసాద్ శనివారం పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి లక్డీకాపూల్, రాజ్ భవన్ ప్రాంతాల్లో పర్యటించారు. వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి, వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. 

లక్డీకాపూల్ ద్వారకా హోటల్ ముందు నుంచి లక్కీ రెస్టారెంట్ మీదుగా అండర్​డ్రైనేజీ కాలువ ద్వారా గతంలో వరద నీరు సాఫీగా ప్రవహించేద‌ని, కాలువ పూడుకుపోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని జీహెచ్ఎంసీ ఈఈ వెంక‌టనారాయ‌ణ‌ రంగనాథ్​కు సూచించారు. కాలువ‌ను పున‌రుద్ధరించాలంటూ రంగనాథ్​ అధికారులను ఆదేశించారు. లక్డీకాపూల్​ రైల్వే బ్రిడ్జి కింద వరద ప్రవ‌హించ‌కుండా ఉన్న అడ్డంకుల‌ను పరిశీలించారు. వారం రోజుల‌లో వ‌ర‌ద కాలువ‌ల‌ను పున‌రుద్ధరించాల‌ని, అప్పటికీ వ‌ర‌ద ముప్పు త‌ప్పని ప‌రిస్థితుల్లో తాత్కాలిక చ‌ర్యలు చేప‌ట్టి వచ్చే వేస‌విలో కాలువ‌ను విస్తరించాల‌ని నిర్ణయించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ అనురాగ్ జ‌యంతితో మాట్లాడి హైడ్రా, డీఆర్ఎఫ్ బృందంతో క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌ను వివరించారు.