
- అందుకు నిదర్శనమే కూకట్ పల్లి నల్లచెరువు
- త్వరలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఫిక్స్
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- హైడ్రాకు అందరూ సమానమే అని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: భావి తరాలకు హైడ్రాతో ఎంతో మేలు జరుగుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని.. హైడ్రా ఎప్పుడూ ప్రజలకు మంచి చేయడానికే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని, దాని విలువ దాదాపు రూ.30 వేల కోట్లకుపైగా ఉంటుందని చెప్పారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడారు.
‘‘మొదట్లో హైడ్రాను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు మేం చేస్తున్న పనులకు ప్రజల నుంచే మాకు మద్దతు లభిస్తున్నది. ఇందుకు కూకట్ పల్లి నల్ల చెరువే నిదర్శనం. మొదట్లో అక్కడ ఆక్రమణలు కూల్చివేసినప్పుడు అక్కడి ప్రజలు హైడ్రాపై కేసులు పెట్టాలన్నారు. కానీ, ఇప్పుడు వాళ్లే మెచ్చుకుంటున్నారు. అలాగే, బతుకమ్మ కుంట అభివృద్ధిని చూసి అక్కడి జనం ప్రశంసిస్తున్నారు. కేవలం చెరువులకే హైడ్రా పరిమితం కాదు. ప్రభుత్వ స్థలాలన్నింటిని కాపాడటమే మా భాధ్యత”అని ఆయన అన్నారు. కొన్నిచోట్ల నాలాల ఆక్రమణలతో ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో తొలగించామని, దీని ద్వారా వరద ఇబ్బందులు తగ్గాయన్నారు. ఇకపై నాలాలను రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తామన్నారు.
మా వైపు తప్పుంటే సమీక్షించుకుంటం..
హైడ్రా ఏర్పడి ఏడాది అవుతున్నదని, మొదట్లో తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ తీసుకుంటున్న చర్యలపై స్టడీ చేశామని రంగనాథ్ తెలిపారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే ఇక్కడకు వస్తున్నారని పేర్కొన్నారు. ఎంక్రోచ్మెంట్స్ విషయంలో తమ చర్యలను అభినందిస్తున్నారని చెప్పారు. ‘‘జీహెచ్ఎంసీ తన చట్టంలో మార్పులు చేసి మాకు అధికారాలు కల్పించింది. సిబ్బంది తక్కువగా ఉన్నా బాగా పనిచేస్తున్నాం. మా వైపు నుంచి తప్పు జరిగితే సమీక్షించుకుంటాం.
హైడ్రాకు అందరూ సమానమే. ఫాతిమా కాలేజ్ అయినా.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు అయినా ఒకేలా చూస్తాం” అని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉందని.. సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా సహకరిస్తున్నారని అన్నారు. వరదల్లో కొన్ని ప్రాంతాల్లో సివరేజ్ మురుగు వస్తుందని.. అలాంటి విషయాల్లో పరిష్కారం కోసం పని చేయడం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు. హైడ్రా పీఎస్ కూడా త్వరలో యాక్టివ్ అవుతుందని చెప్పారు.
హైడ్రాపై మరిత క్లారిటీ రావాలి..
హైడ్రాపై ఇప్పటికే చాలా మందికి అవగాహన వచ్చిందని, ఇంకొంతమందికి క్లారిటీ రావాల్సి ఉందని రంగనాథ్పేర్కొన్నారు. వందేండ్ల ప్లాన్ తో ముందుకు వెళుతున్నామన్నారు. హైడ్రా పరిధిలో 60 నుంచి 65 శాతం చెరువులు మాయమయ్యాయని, సీఎస్ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాంకేతిక ఆధారాలతో మార్కు చేస్తున్నామని, ఇప్పటికే చెరువుల వద్ద భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆస్తులు కొనుగోలు చేసేవారు కూడా జాగ్రత్త పడుతున్నారని, దీనికి కారణం హైడ్రానే అన్నారు.
సరైన వెదర్ సమాచారం ఇచ్చేందుకు యత్నం
అమెరికా, యూరప్ దేశాల మాదిరిగా ఒకే రకమైన వాతావరణం భారత్‌లో ఉండదని రంగనాథ్తెలిపారు. హైదరాబాద్ విషయానికే వస్తే వాతావరణ మార్పులు చాలా వేగంగా మారుతున్నాయన్నారు. తక్కువ విస్తీర్ణంలో వేర్వేరు ఉష్ణోగ్రతలు, గాలులు నమోదవుతున్నాయని, అందువల్ల వాతావరణ అంచనాలు మారుతున్నాయన్నారు. కచ్చితత్వం పెరగాలంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల సంఖ్య పెరగాలన్నారు.
ఇటీవల వాతావరణ శాఖ అధికారులతో కూడా చర్చించామని, కర్నాటకకు వెళ్లి పరిశీలించి వచ్చామన్నారు. త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. అలాగే ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా.. ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తం..
హైడ్రా పరిధిలో 950 చెరువులు ఉండగా.. 150 చెరువుల బౌండరీలకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశామని రంగనాథ్ తెలిపారు. 500 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశామని, మరో 200 చెరువులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 6 నుంచి 9 నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి బౌండరీలు ఏర్పాటు చేస్తామన్నారు. హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. తాము కూడా ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల బౌండరీలు కూడా ఫిక్స్ చేస్తామని, తరువాత చర్యలు తీసుకుంటామన్నారు.