హైడ్రా విజయ పరంపర!

హైడ్రా విజయ పరంపర!

హైడ్రా  అంటే  కూల్చివేతలే  కాదు.  హైడ్రా అంటే  కక్ష సాధింపు  కానే కాదు,  హైడ్రా  అంటే  రాజకీయం అసలే కాదు.   నగరానికి,  నగర ప్రజలకు  మేలుచేసే  గొప్ప యజ్ఞం అది.  హైడ్రా  విజ్ఞతతో  కూడిన సంచలనం.  ఏనాటి  నుంచో  ప్రజలు కోరుకుంటున్న నాలాలు,  చెరువుల  పునరుద్ధరణ,  ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట,  సహజ వనరుల  పరిరక్షణ  అనే  లక్ష్యాలను  సాధించే  బృహత్కార్యం అది.  మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరనుకుంటూ  ఆక్రమణదారులు  విర్రవీగే  సమయంలో  హైదరాబాద్ డిజాస్టర్  రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అనే ఒక గొప్ప కార్యానికి నాంది పలికింది.  

తెలంగాణ ప్రభుత్వం.  ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ యజ్ఞాన్ని  భంగం  చేయడానికి  కొన్ని దుష్టశక్తులు   హైడ్రా  కార్యకలాపాలను అడ్డుకోవాలని  ప్రయత్నాలు చేశాయి.  ఎదురొచ్చిన  కష్టనష్టాలను అధిగమిస్తూ,  సమయానుకూలంగా వ్యూహాలను మార్చుకుంటూ,  న్యాయపోరాటంలో  విజయం సాధిస్తూ ఈ చారిత్రాత్మక కార్యాన్ని దృఢ సంకల్పంతో  ముందుకు తీసుకెళుతున్న హైడ్రా కమిషనర్  ఏవి రంగనాథ్, ఐపీఎస్  అభినందనీయులు.  హైడ్రా ఏర్పాటుతో సరిపెట్టుకోకుండా  సమస్యల   పరిష్కారానికి  ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వ పెద్దల నిబద్ధతకు  నిదర్శనమే హైడ్రా సత్ఫలితాల సమాహారం.

హైడ్రాపై  విశ్వాసం

ఆక్రమ కట్టడాలతో  వెలిసిన  ప్రభుత్వ భూములను  తిరిగి స్వాధీనం చేసుకునే  ప్రయత్నంచేస్తే  సహజంగానే ఆక్రమణదారులకు,  వాటి వాడకందారులకు కంటగింపుగా ఉంటుంది.  వారి ఆగడాలను, ధర్నాలను  ప్రచారం చేయడానికి  కొన్ని మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాల  హడావుడితో  మొదట్లో  కొంత గందరగోళం నెలకొంది.  కాలక్రమేణా  జరిగిన కార్యకలాపాలు,  వాటి సత్ఫలితాలతో  మబ్బులు వీడిపోయి  ప్రజల్లో  హైడ్రాపట్ల  గురి  కుదిరింది.  

ఏడాదికాలంలో  వరుస క్రమంలో  జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ,  పూడికతీత  కార్యక్రమాలు,  నాలాలపై  ఆక్రమణల తొలగింపులతో,  వరద నీటి పారుదలకు  ఆటంకం లేకుండా ముంపు ప్రాంతాలకు  మేలు  జరిగిన  వైనం  ప్రజలకు  అవగతమయ్యింది.  నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేవిధంగా  ప్రజల్లో  హైడ్రా  కార్యకలాపాలపైన  సంపూర్ణ విశ్వాసం  ఏర్పడింది. అదే నిబద్ధత  చూపుతూ హైడ్రా పరిధిని  ఔటర్ రింగ్ రోడ్ వరకు  విస్తరించడంతో  జీహెచ్ఎంసీతోపాటు  రంగారెడ్డి,  మేడ్చల్,  సంగారెడ్డి జిల్లాల పరిధిలోని  ప్రాంతాలను  విపత్తు నుంచి  రక్షణ  కల్పించేందుకు వీలుగా హైడ్రా ప్రణాళికలు  సిద్ధం చేసింది.  గతంలో కట్టిన ఇళ్ళ జోలికి పోకుండా అక్రమంగా నిర్మించిన  వాణిజ్య భవనాలను మాత్రం వదిలిపెట్టడం లేదు.

 ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి 

అక్రమ వలసదారులు, అక్రమ రవాణాదారుల కన్నా  ప్రమాదకరమైనవారు  ప్రభుత్వ,  ప్రైవేటు భూములను ఆక్రమించే అక్రమార్కులు.  ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి పనులకు దోహదం చేసే ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి కిందే లెక్క.  నగరంలో, శివారు ప్రాంతాలలో వేలాది ఎకరాల కాల్వలు, చెరువులు, కుంటల స్థలాలు భూబకాసురుల కబ్జాలో ఉన్నాయి.  పట్టణ ప్రాంతంలో నాలాలు ఆక్రమణలకు గురై  లోతట్టు ప్రాంతాలలో రహదారులపై వరద ముప్పు ముంచుకొచ్చింది.  విలువైన భూములను అవినీతి అధికారుల ఆసరాతో,  రాజకీయ బలంతో  అప్పనంగా కాజేసే  ప్రబుద్ధులకు వెన్నులో చలి పుట్టేవిధంగా  న్యాయపరంగా హైడ్రా కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 

హైడ్రా ఝుళిపిస్తున్న  కొరడా వల్ల  ప్రస్తుతం ప్రభుత్వ భూముల జోలికి వెళ్లడానికి కాకలుతీరిన ఆక్రమణదారులు,  పేరుమోసిన  నేరస్తులు సైతం వెనుకంజ వేస్తున్నారు.  సభ్య సమాజానికి స్వాంతన కలిగించే పరిణామం ఇది. శివారు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగరంలో పార్కులు,  లేఅవుట్ల ఖాళీస్థలాలు,  పరిశ్రమలశాఖ స్థలాలు,  జలవనరులు వీటన్నింటి  ఆక్రమణలపై  ఫిర్యాదులను  ప్రజల నుంచి ఆహ్వానిస్తూ  వాటిని పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు హైడ్రా అధికారులు.
ప్రకృతి విపత్తులను అరికట్టే అవకాశంవర్షాకాలంలో  రహదారులపై  వరద నీరు నిలిచిపోయి  ట్రాఫిక్  సమస్యలు తలెత్తకుండా హైడ్రా  ప్రత్యేక చర్యలు చేపట్టింది.  సుమారు 300 ప్రాంతాల్లో  వరద నీటి నిల్వ సమస్యను గుర్తించి పరిష్కార దిశగా పనులకు శ్రీకారం చుట్టింది.  

సహజ  వనరులను  కాపాడటం ద్వారా  ప్రకృతిపరంగా వచ్చే విపత్తులను అరికట్టే అవకాశం ఉంటుంది.  పర్యావరణ  పరిరక్షణలో భాగంగా  హైడ్రా 12 సరస్సులను పునరుద్ధరించే  ప్రణాళికను రచించింది.  సంస్థ చేసిన కృషి ఫలితంగా  ఎఫ్.టి.ఎల్,  బఫర్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై  ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగింది.  తద్వారా ఇళ్ల స్థలాలు అపార్ట్​మెంట్​ కొనుగోళ్ళ విషయంలో  తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ కష్టార్జితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.  

 జిల్లా కలెక్టర్లు,  జీహెచ్ఎంసీ,  మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు,  గ్రామ పంచాయతీలు,  జలమండలి, హెచ్ఎండిఏ,  హైదరాబాద్  మెట్రో రైలు సంస్థ,  హైదరాబాద్  గ్రోత్  కారిడార్,  మూసీనది అభివృద్ధి సంస్థ,  విపత్తు శాఖ, నీటిపారుదల వంటి సంబంధిత శాఖల సమన్వయంతో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్న హైడ్రా అధికారులను,  వారి పనితీరును  పర్యావరణ వేత్తలు, పౌరసంస్థలు వేనోళ్ళ కొనియాడుతున్నారు.  

మచ్చుకు కొన్ని  విజయాలు

సుమారు ఏడాది కాలంలో హైడ్రా సాధించిన అనేక విజయాలలో మచ్చుకు కొన్నింటిని ఉదహరించుకోవచ్చు.  కోకాపేటలో అక్రమ నిర్మాణాలు, అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చిన్నారికుంటలో అక్రమంగా  నిర్మించిన  మూడు  భవనాలు,  సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు,  ఫిర్జాదిగూడ  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో బతుకమ్మకుంట,  మాదాపూర్​లో సున్నం చెరువు పునరుద్ధరణ. అదే సున్నం చెరువు సమీపంలోని  భూగర్భ జలాలను తోడేసి  టాంకర్లలో తరలిస్తూ  సొమ్ము  చేసుకుంటున్న తోడేళ్ల తోక  కోయడం జరిగింది.  ఈ నెలతో  ఏడాదికాలం విజయవంతంగా పూర్తి చేసుకుని సమాజ శ్రేయస్సు,  పర్యావరణ  పరిరక్షణ నిమిత్తం లక్ష్యసాధన దిశగా  నిబద్ధతతో   ముందుకుసాగుతున్న  హైడ్రా కమిషనర్,  వారి సిబ్బందికి  ప్రజల తరఫున అభినందనలు. 

- ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్​సి కుమార్,సోషల్ ​ఎనలిస్ట్​-