
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. పద్మ శ్రీహిల్స్ కాలనీలో 1983లో పదెకరాల విస్తీర్ణంలో 230 ప్లాట్లతో లేఅవుట్ వేయగా.. ఇందులో 2,600ల గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. మున్సిపల్ అధికారులు ఈ పార్క్ చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగా.. పక్కనే ల్యాండ్ ఉన్నవారు ఆ స్థలం తమదని అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి.
కాలనీవాసులు ఈ విషయమై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు శనివారం స్థానిక రెవెన్యూ, మున్సిపల్అధికారులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు. పార్క్‌కు కేటాయించిన స్థలమేనని నిర్ధారించి, చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. పక్కనే ఉన్న పీఎన్‌టీ కాలనీలోని డి–బ్లాక్‌లో మరో 1,112 గజాల పార్క్స్థలానికి కూడా కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, బోర్డులు ఏర్పాటు చేశారు.