హ్యుందాయ్ లాభం రూ.1,614 కోట్లు.. ఏడాది లెక్కన 4 శాతం తగ్గుదల

హ్యుందాయ్ లాభం రూ.1,614 కోట్లు.. ఏడాది లెక్కన 4 శాతం తగ్గుదల
  • మొత్తం ఆదాయం రూ.17,940 కోట్లు
  • రూ.21 చొప్పున ఫైనల్​ డివిడెండ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో అమ్మకాలు తగ్గడంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లాభం (కన్సాలిడేటెడ్​) 4 శాతం తగ్గి రూ.1,614 కోట్లకు చేరుకుంది. 2023–-24 జనవరి-మార్చి కాలంలో ఈ ఆటోమేకర్ రూ.1,677 కోట్ల నికరలాభం సంపాదించింది.  గత సంవత్సరం ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.17,671 కోట్లతో పోలిస్తే ఈసారి ఆదాయం రూ.17,940 కోట్లకు పెరిగిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్​ఎంఐఎల్​) రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. 2023–-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో 1,60,317 యూనిట్లు విక్రయించగా, ఈ క్వార్టర్​లో ఈ సంఖ్య 1,53,550గా ఉందని కంపెనీ తెలిపింది.

ఇదే కాలంలో ఎగుమతులు 33,400 యూనిట్ల నుంచి 38,100 యూనిట్లకు పెరిగాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి, కంపెనీ కన్సాలిడేటెడ్​ నికరలాభం 7 శాతం తగ్గి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.6,060 కోట్ల నుంచి రూ.5,640 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.69,829 కోట్ల నుంచి రూ.69,193 కోట్లకు తగ్గింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 6,14,721 యూనిట్లు అమ్మగా, గత ఆర్థిక సంవత్సరం ఇవి 5,98,666 యూనిట్లకు తగ్గాయి. 2023–-24లో  ఎగుమతులు 1,63,155 యూనిట్లు కాగా, 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,63,386 యూనిట్లను ఎగుమతి చేసింది. 

హైబ్రిడ్​ వెహికల్స్ కూడా..
2030 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ పోర్ట్​ఫోలియోలో 20 ఐసీఈ మోడల్స్​, ఆరు ఈవీ మోడల్స్​ ఉంటాయని కంపెనీ ఎండీ ఉన్సూ కిమ్​అన్నారు.  హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ల వంటి కొత్త పర్యావరణ అనుకూల ఇంజన్​లనూ ప్రవేశపెడతామని వెల్లడించారు హెచ్​ఎంఐఎల్​  సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి  8 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోందని వెల్లడించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాలలో దాదాపు 69 శాతం వాటా ఎస్​యూవీలదే ఉందని ఆయన పేర్కొన్నారు.

వ్యూహాత్మక పెట్టుబడుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 7,000 కోట్ల మూలధనాన్ని కేటాయించినట్లు హ్యుందాయ్ తెలిపింది.   పూణే ప్లాంట్‌‌‌‌‌‌‌‌ కోసం 25 శాతం క్యాపెక్స్​ను కేటాయించాలని నిర్ణయించింది. 2030 నాటికి పీవీ విభాగంలో ఈవీల వాటా 13-–14 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు గార్గ్ చెప్పారు. ఈవీలను ప్రోత్సహించడానికి  డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లపై కూడా దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. 2024–-25 సంవత్సరానికి హ్యుందాయ్​ బోర్డు ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.21 తుది డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను సిఫార్సు చేసింది.