పంత్ ఆడుతుంటే టీవీలకు అతుక్కుపోవాలంతే

పంత్ ఆడుతుంటే టీవీలకు అతుక్కుపోవాలంతే

టీమిండియాలో బెస్ట్ స్ట్రోక్ ప్లేయర్లలో యువ కీపర్ రిషబ్ పంత్ ఒకడిగా ఎదుగుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఆడిన సిరీస్‌‌ల్లో తన కీపింగ్, బ్యాటింగ్‌‌ స్కిల్స్‌‌తో సత్తా చాటి టెస్ట్ ఫార్మాట్‌‌లోనూ తాను విలువైన ఆటగాడినని నిరూపించుకున్నాడు. అందుకే ఈ లెఫ్టాంటెడ్ బ్యాట్స్‌మన్‌ మీద ఇంగ్లండ్ పేసర్ టైమల్ మిల్స్ ప్రశంసలు కురిపించాడు. తాను టెస్ట్ క్రికెట్ చూడటానికి ఏకైక కారణం పంత్ బ్యాటింగేనని మిల్స్ చెప్పాడు. 

‘నేను వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నా. గాయాల కారణంగా టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు. అదే టైమ్‌‌లో ట్రెడిషనల్ గేమ్‌‌ను చూడట్లేదు కూడా.. కానీ రిషబ్ పంత్ ఆడుతున్నప్పుడు మాత్రం నేను పక్కా చూస్తా. అతడు ఆడుతుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టీవీకి అతుక్కుపోవాలని అనిపిస్తుంది. పంత్ ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌‌లు సూపర్బ్. క్రికెట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలనేది నా అభిమతం. మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా పంత్ ఆడే తీరులో పెద్దగా తేడా ఉండదు’ అని మిల్స్ పేర్కొన్నాడు. ఇకపోతే, 2017లో ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మిల్స్ ఎంపికయ్యాడు.