
ఓటీటీ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులంతా భాషాభేదం లేకుండా సినిమాలు, సిరీస్‌లు తెగ చూసేస్తున్నారు. అందులో ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అంటే మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మలయాళం యాక్టర్స్ కూడా అన్ని భాషల్లోనూ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు నటుల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఎప్పుడెప్పుడు చూద్దామా..? అని ఎదురుచూస్తున్నారు కూడా. అలాంటి వాళ్లలో పెద్ద పెద్ద స్టార్స్ మాత్రమే కాదు.. యంగస్టర్స్ కూడా చాలామందే ఉన్నారు. వాళ్లలో ఒకరే మాథ్యూ థామస్. నిజానికి ఈ పేరు తెలుగు ఆడియెన్స్‌లో చాలామందికి తెలియదు. కానీ, ఇతన్ని చూస్తే మాత్రం ఫలానా సినిమాలో ఉన్నాడు అని టక్కున గుర్తుపట్టేస్తారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్న ఈ యాక్టర్ జర్నీ విశేషాలు ఈ వారం పరిచయంలో..
మాథ్యూ నటించిన సినిమాలు ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ అయ్యాయి. కానీ, తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేది మాత్రం తమిళ నటుడు ధనుష్ డైరెక్షన్లో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా” సినిమాతోనే. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన మాథ్యూ ప్రేక్షకుల్ని అంతగా అలరిస్తాడు. ప్రస్తుతం ‘లవ్లీ’ అనే ఫాంటసీ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇందులో ఒక ఈగతో ఫ్రెండ్షిప్ చేసే కుర్రాడిలా కనిపిస్తాడు మాథ్యూ.
ఇక మాథ్యూ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మాథ్యూ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో తిరువంకుళంలో 2002లో పుట్టాడు. తండ్రి బిజు జాన్.. ఇంజినీర్. తల్లి సూసన్ కె మాథ్యూ.. స్కూల్ టీచర్. తనకు ఒక బ్రదర్ ఉన్నాడు. అతని పేరు జాన్ థామస్.. సోషల్ వర్కర్. మాథ్యూ తమిళనాడులోని ‘ఆదిశక్తి లాబొరేటరీ ఫర్ థియేటర్ ఆర్ట్ రీసెర్చ్’లో జరిగిన యాక్టింగ్ సెషన్లో పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. ఇతర ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ వాక్ కూడా చేశాడు.
టెన్త్‌లోనే కెరీర్ స్టార్ట్
మాథ్యూ పదో తరగతిలో ఉన్నప్పుడు ‘కుంబలాంగి నైట్స్’ అనే సినిమాలో ఆడిషన్ ఇచ్చాడు. ఆ ఏడాది పరీక్షలు అయిపోయాక సినిమా షూటింగ్ మొదలైంది. ఆ సినిమాలో తన పాత్ర కోసం మాథ్యూ స్విమ్మింగ్, కుకింగ్, ఫుట్‌బాల్ ప్లేయింగ్, సెయిలింగ్ వంటి కొన్ని యాక్టివిటీస్ నేర్చుకున్నాడు. 2019లో వచ్చిన ఈ సినిమా తన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ అయ్యాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందో నిజ జీవితంలో నేనూ అలానే ఉంటాను. చాలా మౌనంగా ఉంటాను. అవసరమైనప్పుడే మాట్లాడుతుంటాను” అని తన గురించి చెప్పాడు.
కలలో కూడా అనుకోలేదు
‘‘యాక్టర్‌ని అవుతానని కలలో కూడా అనుకోలేదు. నటుడిగా నన్ను నేనెప్పుడూ ఊహించుకోలేదు కూడా. యాక్సిడెంటల్‌గా యాక్టర్నైపోయా. ఆరేండ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నటిస్తున్నానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యమనిపిస్తుంది. నటన ప్రత్యేకంగా ఎక్కడా నేర్చుకోలేదు. సినిమాలు చూడడమే నా మొదటి ఇన్స్పిరేషన్. సినిమాలు చూస్తూ నటన నేర్చుకోవడం అలవాటు చేసుకున్నా. నేను చేసే ఒక్కో సినిమా నుంచి కొంత నేర్చుకుంటూ ఉంటాను.
నా స్కిల్స్‌ని మెరుగుపరుచుకుంటూనే ఉంటాను. సక్సెస్ వచ్చినా రాకపోయినా ఎక్స్పరిమెంట్స్ చేయడం ఇంపార్టెంట్ అని నమ్ముతా. ఎందుకంటే సినిమాల్లో ప్రతీది ట్రై చేస్తూ ఉండాలి. ఏది సక్సెస్ అవుతుందో.. ఏది కాదో.. గ్యారెంటీగా చెప్పలేం ఈ బిజినెస్‌లో. అలాగే ఇండస్ట్రీలో నాతోటి వాళ్లు కూడా మంచి ప్రాజెక్ట్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. వాళ్లను చూసి ఎప్పుడూ అసూయపడలేదు. మా మధ్య ఉండేది హెల్దీ కాంపిటీషన్ మాత్రమే. ఒకరి సినిమాకు మరొకరం సపోర్ట్ చేసుకుంటుంటాం’’ అంటున్నాడు మాథ్యూ థామస్.
మాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా..
కెరీర్ బిగినింగ్ నుంచి ఏడాదికి రెండుమూడు ప్రాజెక్ట్స్‌కి పైగా చేస్తూ బిజీ ఉంటాడు మాథ్యూ. తను నటించిన ప్రతి ప్రాజెక్ట్ ఎంతో కొంత తనకు ఉపయోగపడింది. వాటిలో కొన్ని లీడ్ యాక్టర్‌గా, మరికొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశాడు. పాత్ర ఏదయినా సరే తనకంటూ గుర్తింపు దక్కే విధంగా స్ర్కిప్ట్ సెలక్షన్ చేసుకోవడం మాథ్యూ ప్రత్యేకత అనే చెప్పొచ్చు.
అయితే తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అని అడిగితే.. ‘‘ఫలానా జానర్లోనే నటించాలని నియమం ఏం పెట్టుకోలేదు. నేను ఎక్కువగా కమర్షియల్ మూవీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తా. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే కథలే నాకు నచ్చుతాయి. ఎంటర్టైన్ చేస్తూనే ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే కథలంటే చాలా ఇష్టం. వాళ్ల టైం కేటాయించి, డబ్బులు పెట్టి థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తున్నవాళ్లకు శాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అలా అనుకునే నా స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను” అని చెప్పాడు.
తమిళంలో విజయ్ కొడుకుగా..
‘కుంబలాంటి నైట్స్’ తర్వాత తను నటించిన మరో సినిమా ‘తన్నీర్ మథన్ దినంగల్’. అదే ఏడాదిలో రిలీజ్ అయిన ఆ సినిమా కూడా సక్సెస్‌ని అందించింది. దాంతోపాటు మాథ్యూకి రెండు అవార్డులు సొంతమయ్యాయి. సరిగ్గా పాతికేండ్లు కూడా నిండని ఈ యంగ్‌స్టర్ మలయాళంతోపాటు తమిళంలోనూ సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించాడు. తన మొదటి సినిమానే తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’. అందులో ఆయన కొడుకు పాత్రలో నటించాడు. ఆ సినిమాతో ఇతర భాషల్లోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘లియో’ సినిమాలో విజయ్ కొడుకుగా నటించడంతో చూసిన వాళ్లంతా టీనేజ్‌లో విజయ్లానే కనిపిస్తున్నాడని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఆ సినిమా ఓకే అయ్యాక డైరెక్టర్ లోకేష్‌తో.. ‘‘నాకు తమిళం రాదు.. టెన్షన్‌గా ఉందని నా మనసులో ఉన్న డౌట్లు అన్నీ చెప్పా. దాంతో డైరెక్టర్ నేను రిలాక్స్ అయ్యి కంఫర్ట్‌బుల్‌గా నటించేందుకు కాస్త టైం ఇచ్చాడు. షూటింగ్ జరిగినన్ని రోజులూ తనకు సపోర్ట్ చేశాడు” అని చెప్పుకొచ్చాడు.