న్యూఢిల్లీ: తమ ఆదాయాలను తక్కువగా చూపడం, తప్పుడు ఖర్చులను చూపడం ద్వారా బీమా కంపెనీలు, మధ్యవర్తులు దాదాపు రూ. 30 వేల కోట్ల ఆదాయపు పన్నును ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇలా చేస్తున్నారు. బకాయిలను రికవరీ చేయడానికి ఐటీ శాఖ ఈ సంస్థలకు డిమాండ్ నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. వడ్డీ, జరిమానాలు విధించడంతో మొత్తం బకాయిలు పెరగవచ్చని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. బీమా రంగంలో పన్ను ఎగవేతలు పెరుగుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి.
చట్టపరమైన చర్యలు, డబ్బు రికవరీ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాయి. ఒక్కో కేసులో వడ్డీ, జరిమానా ఎంత చెల్లించాలనేది అసెస్మెంట్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ సహకారంతో ఐటీ డిపార్ట్‌మెంట్ గతేడాది విచారణ ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కమీషన్ల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీమా కంపెనీలపై దృష్టి సారించింది. ఏజెంట్లు మధ్యవర్తులకు పరిమితులకు మించి చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం నకిలీ ఇన్వాయిస్లు తయారు చేయడం సహా పలు అక్రమాలకు పాల్పడ్డారు.
