టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతైనా కష్టపడతా

టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతైనా కష్టపడతా

చెన్నై: భారత క్రికెట్ జట్టులో ప్లేస్ కోసం కుర్ర క్రికెటర్లు చాలా పోటీ పడుతుంటారు. ఒకసారి టీమ్ లో చోటు దక్కించుకున్నా.. రాణించకంటే మళ్లీ అంత సులువుగా జట్టులోకి రావడం కష్టమనే చెప్పాలి. యంగ్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ పరిస్థితి ఇలాగే ఉంది. 2016లో టీమ్ ఇండియాలోకి వచ్చిన విజయ్.. మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. అవకాశాన్ని అందిపుచ్చుకొని కీలక ఆటగాడిగా ఎదిగాడు. మళ్లీ 2019లో టీమ్ లోకి వచ్చినా విజయ్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఈ విషయం పై అతడు స్పందించాడు. గాయాల వల్లే టీమ్ లో కుదురుకోలేక పోయానని చెప్పాడు.

'గాయాల నుంచి కోలుకుని కంబ్యాక్ చేయడం అంత సులువు కాదు. కానీ నేను భారత జట్టులో ఉన్నప్పుడు బాగానే ఆడా. నేను ఫిట్ గా ఉంటే ఇంకా బెటర్ గా ఆడేవాడ్ని. క్రీడాకారులకు గాయాలవ్వడం కామన్. భారత జట్టులో చోటు పొందడం నా చేతిలో లేదు. మ్యాచుల్లో బాగా ఆడటం, బాగా ప్రాక్టీస్ చేయడమే నా చేతిలో ఉంది. అందుకే బాగా కష్టపడుతున్నా. పోలికలు నాకు ఇష్టం ఉండవు. కానీ మిగతా ఆల్ రౌండర్లతో పోలిస్తే నేను చాలా బాగా ఆడా' అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు.