అవమానాల్ని దాటి..

అవమానాల్ని దాటి..

అమ్రిత జోసఫ్​ మాథ్యు..​ కొచ్చిలో ఒక చిన్న జ్యూస్​ స్టాల్​ ​నడుపుతోంది. చేస్తున్న పని చిన్నదే. కానీ, ఈమె మనసు మాత్రం చాలా పెద్దది. అంతకంటే గట్టిది ఈమె గుండె. అందుకే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా... సొసైటీ ఎన్ని సూటిపోటి మాటలన్నా ధైర్యంగా నిలబడింది. ఎదిరించింది. తను నమ్మిన దానికోసం పోరాడింది. తనలాంటి మరెందరో ట్రాన్స్​జెండర్స్​కు ఇన్​స్పిరేషన్​గా నిలిచింది. ఆమె గురించి మరిన్ని వివరాలు..

అమ్రితది మధ్య తరగతి కుటుంబం. దాంతో పేరెంట్స్​కు తన చదువు భారం కావొద్దని, ఎనిమిదో క్లాస్​తోనే చదువు ఆపేసింది. అక్కడితో మొదలైన కష్టాలు.. తను అబ్బాయి రూపంలో ఉన్న అమ్మాయని తెలిశాక మరింత పెరిగాయి. ఆ నిజం బయటికొస్తే ‘సొసైటీ  వెక్కిరిస్తుందేమో... కన్నవాళ్లు దూరం పెడతారేమో’ అన్న భయాలు ఊపిరాడనివ్వలేదు. అందుకే ఆ నిజాన్ని బయటకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆ బాధలో కుంగిపోతున్నప్పుడే.. ఒక ట్రాన్స్​ విమెన్​ డాన్స్​ ట్రూప్​ పరిచయమైంది అమ్రితకి. వాళ్లని కలిశాక అప్పటివరకు ఉన్న జీవితాన్ని వదిలేయాలనుకుంది. ఆ ప్రయత్నంలోనే శ్రీనటరాజ కళాసమితి అనే డాన్స్​ ట్రూప్​కి కో– ఆర్డినేటర్​గా, ఆర్గనైజర్​గా పనిచేసింది. కొన్ని పర్ఫార్మెన్స్​లు కూడా ఇచ్చింది. అంతా హ్యాపీగానే ఉన్నా.. తనది కాని జీవితంలో తాను ఉంటున్నట్టు అనిపించింది అమ్రితకు. దాంతో ట్రాన్స్​ విమెన్​గా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకుంది. 
 

అమ్మ అండగా నిలిచింది
 ఒక మలయాళీ టెలివిజన్​ షోలో ట్రాన్స్​ విమెన్​గా మొదటిసారి అందరి ముందుకొచ్చింది అమ్రిత. ఆ షో టెలికాస్ట్​ అయ్యాక అప్పటివరకు తనను వెంటాడిన పీడకలలన్నీ నిజంలా ఆమె కళ్లముందునిలిచాయి. అమ్రిత ట్రాన్స్​ విమెన్​ అన్న నిజాన్ని మొదట ఆమె తల్లి కూడా తట్టుకోలేకపోయింది. ఆ తరువాత అంగీకరించింది. కానీ, ఇరుగుపొరుగు వాళ్లు, తెలిసినవాళ్లు అమ్రిత కుటుంబాన్ని ఎగతాళి మాటలతో ఇబ్బంది పెట్టారు. బంధువులైతే ఇంటి వైపు చూడటమే మానేశారు. అయినా సరే.. తల్లి సాయంతో వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది. 2017లో గవర్నమెంట్​ సాయంతో కొచ్చిలోని కక్కనాడ్ సివిల్ స్టేషన్​లో జ్యూస్ సెంటర్ మొదలు పెట్టింది. రకరకాల ఫ్రూట్​ జ్యూస్​లతో పాటు క్యారెట్, బీట్​రూట్, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం కలిపి అమ్రిత చేసే స్పెషల్​ జ్యూస్​ల కోసం కస్టమర్స్​ క్యూ కడుతున్నారిప్పుడు. తన పేరుతో పచ్చళ్లు తయారుచేసి, అమ్ముతోంది. వాట్సాప్ లో కూడా ఆర్డర్ తీసుకొని డెలివరీ చేస్తోంది .    

వాళ్లకి ఉపాధి కల్పిస్తా
నా చిన్నప్పుడు ట్రైన్​లో​ వెళ్తుంటే ట్రాన్స్​జెండర్స్​ డబ్బులు అడుగుతూ కనిపించారు. వాళ్లని చూసి చాలా భయపడ్డా. వీళ్లేంటి ఇలా ఉన్నారనుకున్నా.. ఇరవై య్యేండ్లు వచ్చాక నేను కూడా ఆ కమ్యూనిటీలో ఒకదాన్నే అని తెలిసి, తట్టుకోలేకపోయా.  నాలాంటి వాళ్లని ఎవరూ పనిలో పెట్టుకోరని తెలిశాక... నాకు నేనే ఉపాధి కల్పించుకోవాలనుకున్నా. ఆ ప్రయత్నంలోనే అమ్మ సాయంతో పచ్చళ్లు, జ్యూస్​  బిజినెస్​ మొదలుపెట్టా. ఫ్యూచర్​లో ఈ బిజినెస్​ మరింత విస్తరించాలనుకుంటున్నా. నాలాంటి ట్రాన్స్​జెండర్స్​కు ఉపాధి కల్పించాలి అనుకుంటున్నా.