అందులో తప్పేం లేదు.. వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతా: మిచెల్ మార్ష్

అందులో తప్పేం లేదు.. వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతా: మిచెల్ మార్ష్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీని అగౌరవపరిచేలా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం మార్ష్.. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో చేతిలో బీరు సీసా పట్టుకొని, వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫొటోలు దిగాడు. వాటిని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. ప్రతిష్టాత్మక వరల్డ్‌ కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడం ద్వారా దాని ప్రతిష్టను అవమానపరిచేలా వ్యవహరించాడని అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఈ ఘటనపై అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, ఈ వివాదంపై మార్ష్ తొలిసారి స్పందించాడు.

వరల్డ్‌కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడాన్ని సమర్ధించుకున్న మార్ష్.. అవకాశం వస్తే మరోసారి అలా చేయడానికి కూడా తాను వెనుకాడనని చెప్పుకొచ్చాడు. "ఆ ఫొటోలో వరల్డ్‌ కప్ ట్రోఫీని అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. నాతోనూ ఈ విషయం గురుంచి చాలా మంది చెప్పారు. ఏదో జరిగిపోయిందని చెప్పారు. కానీ నేను సోషల్ మీడియా చూడలేదు. అందులో అసలు ఏమీ లేదు.." అని మార్ష్ తెలిపాడు. మరోసారి అలా కాళ్లు పెడతావా అని అతన్ని హోస్ట్ ప్రశ్నించగా.. అవకాశం వస్తే చేయొచ్చు అని బదులిచ్చాడు.  ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ఈఎన్ రేడియోతో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు

కాగా, వరల్డ్ కప్ ట్రోఫీ కాళ్లు ఉంచడం ద్వారా దాని ప్రతిష్టను అవమానించటంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని అవమానించారని అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఇంతవరకూ కేసు నమోదు అవ్వలేదు.