డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవద్దు

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవద్దు
  • హైడ్రాక్సీక్లోరోక్విన్ సైడ్ ఎఫెక్ట్స్ పై స్టడీ చేస్తున్నాం: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: హైడ్రాక్సీక్లోరోక్విన్ సైడ్ ఎఫెక్ట్స్ పై స్టడీ చేస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది. కొందరు హెల్త్ కేర్ సిబ్బంది సొంతంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటంతో కడుపునొప్పి, హైపోగ్లైసేమియా ఇతర ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. ఈ మెడిసిన్ ను వాడిన హెల్త్ కేర్ సిబ్బంది డేటా సేకరించామని, సైడ్ ఎఫెక్ట్స్ పై స్టడీ మొదలుపెట్టామని ఐసీఎంఆర్ లోని ఎపిడెమియాలజీ కమ్యూనికేబల్ డిసీజెస్ హెడ్ రామన్ ఆర్ గంగాఖేడ్కర్ చెప్పారు. “క్లోరోక్విన్ తీసుకున్న హెల్త్ కేర్ సిబ్బంది సగటు వయసు 35 ఏళ్లు. 10 శాతం మందిలో కడుపునొప్పి, ఆరు శాతం మందిలో వాంతి, 1.3 శాతం మందిలో హైపోగ్లైసేమియా (రక్తంలో గ్లూకోజ్ తగ్గడం) లక్షణాలు గుర్తించాం. 20 శాతం మందికి డయాబెటీస్, బీపీ, శ్వాస సమస్యలు ఉన్నాయి. వీరంతా మెడిసిన్ వాడే ముందు ఈసీజీ తీయించుకోలేదు. కరోనా సోకుతుందనే భయంతో ఈ మెడిసిన్ వాడారు. కొందరిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. డాక్టర్ల సలహా మేరకే క్లోరోక్విన్ వాడాలి” అని అన్నారు. కరోనాపై హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎలా పని చేస్తోందనే అంశంపైనా స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. దీని కోసం 480 మంది పేషెంట్లను 8 వారాలపాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. ఎబోలాకు వాడే రెమిడెసివిర్ మెడిసిన్ పై స్పందించిన ఐసీఎంఆర్.. దీనిపై క్లినికల్ ట్రయల్ పూర్తి కాలేదన్నారు. ఈ మెడిసిన్ వాడితే ముగ్గురిలో ఇద్దరికి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం రాలేదని అబ్జర్వేషన్ లో తేలినట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ మెడిసిన్ మన దేశంలో అందుబాటులో లేదని చెప్పారు. కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ కోసం హైడ్రాక్సిక్లోరోక్విన్ ను అజిత్రోమైసిన్ తో కలిపి వాడొచ్చని గతంలో ఐసీఎంఆర్ రెకమండ్ చేసింది. అయితే తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచించింది.