అక్టోబర్​లో థర్డ్​ వేవ్ ముప్పు

అక్టోబర్​లో థర్డ్​ వేవ్ ముప్పు

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే..ఆ ఆనవాళ్లు: ఐసీఎంఆర్​
ఆ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ అవుతున్నయని ఆందోళన
సెకండ్​ వేవ్​ ఎక్కువున్న రాష్ట్రాలకు ముప్పులేదని కామెంట్​
తక్కువున్న రాష్ట్రాల్లోనే ఎఫెక్ట్​ ఎక్కువుండే అవకాశమని హెచ్చరిక
ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచన

దేశంలో అతి త్వరలోనే కరోనా మూడోవేవ్​ ముంచుకొచ్చే ముప్పుందని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. అక్టోబర్​ నాటికి అది పీక్​ స్టేజ్​కు వెళ్లే ప్రమాదముందని వెల్లడించింది.
న్యూఢిల్లీ: సెకండ్​ వేవ్​లో కేసులు ఎక్కువగా నమోదు కాని రాష్ట్రాలకు థర్డ్​వేవ్​ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్​ ఎపిడెమియాలజీ అండ్​ కమ్యూనికబుల్​ డిసీజెస్​ చీఫ్​ డాక్టర్​ సమీరన్​ పాండా చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని, థర్డ్​వేవ్​ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో పరిస్థితులను చూసిన తర్వాత చాలా రాష్ట్రాలు సెకండ్​ వేవ్​లో కఠినమైన ఆంక్షలను విధించాయని, వ్యాక్సినేషన్​లో వేగం పెంచాయని ఆయన గుర్తు చేశారు. దీంతో అప్పుడు అక్కడ కేసులు ఎక్కువగా నమోదు కాలేదని, కానీ, ఇప్పుడు మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. అలాగని మిగతా రాష్ట్రాలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఇప్పుడు కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనిస్తూ చర్యలను తీసుకోవాలని సూచించారు. ఫస్ట్​వేవ్​, సెకండ్​వేవ్​లో పరిస్థితులకు తగ్గట్టుగా థర్డ్​వేవ్​కు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్లను తెరుస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ కూడా స్కూళ్లను తెరవాలని సూచించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరిచినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్​ పాండా చెప్పారు. దాదాపు సగం మంది చిన్నారులకు కరోనా సోకినట్టు నాలుగో సీరో సర్వేలో తేలిందన్నారు. అయితే, స్కూళ్లు తెరవడం ప్రమాదమా, కాదా అన్న దానిపై చర్చలను పక్కనపెట్టేసి.. ముందుజాగ్రత్తగా అన్ని చర్యలను తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. ‘‘పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్​ సిబ్బంది, బస్​ డ్రైవర్లు, కండక్టర్లందరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలి. కరోనా రూల్స్​ను తప్పకుండా పాటించాలి. కరోనా రూల్స్​ గురించి వివరిస్తూ అన్ని చోట్లా హోర్డింగ్​లను ఏర్పాటు చేయాలి. స్కూళ్లలోనూ రూల్స్​ బోర్డు పెట్టాలి’’ అని పాండా సూచించారు. సెకండ్​ వేవ్​ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో స్కూళ్లను ఓపెన్​ చేసినా ఏం కాదని, సెకండ్​ వేవ్​ రాని రాష్ట్రాల్లో మాత్రం జాగ్రత్తగా ఓపెన్​ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.