
- స్వల్పంగా పెరిగిన మొండిబాకీలు
- రెపో రేట్ల కోతతో పడిన వడ్డీ మార్జిన్స్
- మైక్రో ఫైనాన్స్ బిజినెస్‌లో సమస్యలున్నాయి: వైద్యనాథన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 462.6 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.681 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే ఇది 32.07 శాతం తక్కువ. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 5శాతం పెరిగి రూ.4,695 కోట్ల నుంచి రూ.4,933 కోట్లుకు చేరింది.
జూన్ క్వార్టర్‌లో బ్యాంక్ అసెట్ క్వాలిటీపై ఒత్తిడి కనిపించింది. గ్రాస్ నాన్-పెర్ఫార్మింగ్ ఆస్తులు (జీఎన్‌పీఏ) రేషియో ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 1.87శాతం ఉంటే, జూన్ క్వార్టర్‌లో 1.97శాతానికి పెరిగింది. మొత్తం గ్రాస్ ఎన్‌పీఏల విలువ రూ.4,433.5 కోట్ల నుంచి రూ.4,867.5 కోట్లకు చేరింది. నెట్ ఎన్‌పీఏల రేషియో 0.53శాతం నుంచి 0.55శాతానికి పెరగగా, వీటి విలువ రూ.1,230 కోట్ల నుంచి రూ.1,346 కోట్లకు ఎగిసింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 24 బేసిస్ పాయింట్లు తగ్గి 5.95శాతం నుంచి 5.71శాతానికి పడింది. రెపో రేటు తగ్గడంతో లోన్లపై వడ్డీలను బ్యాంక్ తగ్గించాల్సి వచ్చింది.
ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా పడింది. వడ్డీ మార్జిన్ అంటే లోన్లపై పొందే వడ్డీ మైనస్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో 3.1శాతం తగ్గి రూ.70.63 వద్ద ముగిశాయి. అయినప్పటికీ, ఈ ఏడాదిలో ఇప్పటివరకు షేర్ 10శాతం లాభపడింది.
బ్యాంక్ ఎండీ వీ. వైద్యనాథన్ మాట్లాడుతూ, "మా కోర్ బిజినెస్ బాగా వృద్ధి చెందుతోంది. త్వరలో సేకరించే ఫండ్స్‌తో మా క్యాపిటల్ అడిక్వసీ రేషియో17.6శాతానికి చేరుకుటుంది. కస్టమర్ డిపాజిట్లు జూన్ క్వార్టర్‌లో ఏడాది లెక్కన 25.5శాతం పెరిగాయి" అని తెలిపారు.
డిపాజిట్లపై తగ్గనున్న వడ్డీ..పెరగనున్న మార్జిన్స్
మైక్రోఫైనాన్స్ మినహా అన్ని వ్యాపారాలు బాగా పనిచేస్తున్నాయని, జీఎన్‌పీఏ 1.97శాతంగా, నెట్ ఎన్‌పీఏ 0.55శాతంగా ఉన్నాయని వైద్యనాథన్ పేర్కొన్నారు. రెపో రేటు ప్రయోజనాలను అర్హులైన రుణగ్రహీతలకు బదిలీ చేయడం వంటి కారణాల వల్ల మార్జిన్‌లు తగ్గాయని, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో ఇవి పుంజుకుంటాయని హామీ ఇచ్చారు.
టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించనుండడమే ఇందుకు కారణం. మైక్రోఫైనాన్స్ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతుండడం, క్యాపిటల్ సేకరిస్తుండడంతో లాంగ్‌టెర్మ్‌లో మంచి గ్రోత్ నమోదు చేస్తామని వైద్యనాథన్ అన్నారు. మైక్రోఫైనాన్స్ సవాళ్లను అధిగమించే సామర్థ్యం ఉందని హైలైట్ చేశారు.