మాజీ సీఎంకు ఏమన్నా జరిగితే .. జగన్ దే బాధ్యత : టీడీపీ అభిమానులు

మాజీ సీఎంకు ఏమన్నా జరిగితే .. జగన్ దే బాధ్యత : టీడీపీ అభిమానులు

ఖమ్మం టౌన్, వెలుగు : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఖమ్మం నగరంలో పార్టీలకు అతీతంగా ర్యాలీలు చేపట్టారు. టీడీపీ అభిమానులు స్వచ్ఛందంగా శ్రీశ్రీ సర్కిల్  నుంచి ప్లకార్డులు చేతపట్టి జడ్పీ సెంటర్ వరకు కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ పెవిలియన్  గ్రౌండ్  వరకు పాదయాత్ర చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. పాదయాత్రలో నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పాల్గొని మాట్లాడారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు.

జడ్  ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ప్రాణాలకు హాని కలిగితే, జగన్మోహన్  రెడ్డే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ఆగ్రహావేశాలకు జగన్  గురికావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. జరగబోయే పరిణామాలకు జగన్  సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు అవినీతి మరక అంటించారని ఆరోపించారు. మాజీ సీఎంను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చైతన్య కృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు జగన్  ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. నిరసన ప్రదర్శనల్లో బాలసాని లక్ష్మీ నారాయణ, చింతనిప్పు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.