క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండి ఉంటే భారత జట్టు గెలిచేది: కన్నడ నటుడు

క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండి ఉంటే భారత జట్టు గెలిచేది: కన్నడ నటుడు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 కప్ ఫైనల్ పోరులో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. టోర్నీ అసాంతం వరుస విజ‌యాలు సాధించిన రోహిత్ సేన ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఒక్క ఓట‌మి మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో భారత ఆట‌గాళ్లు అసాధార‌ణంగా పోరాడారు. టైటిల్ గెలవాలనే తపన వారిలో ప్రతిక్షణం కనిపించింది. అయితే, కొందరు మేధావులు మాత్రం భారత్ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయంటూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. అందులో ఇదొకటి. 

క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండి ఉంటే భారత జట్టు తప్పక ప్రపంచ కప్‌ గెలిచేదని కన్నడ నటుడు చేతన్ కుమార్ వాదిస్తున్నాడు. "భారత్‌లో క్రికెట్ రిజర్వేషన్లు ఉంటే.. టీమిండియా సులభంగా ఈ ప్రపంచ కప్‌ గెలుచుకునేది. నేను మరోసారి చెప్తున్నా.. భారతదేశానికి క్రికెట్‌లో రిజర్వేషన్లు అవసరం.." అని కన్నడ నటుడు ట్వీట్ చేశాడు. అందుకు దక్షిణాఫ్రికా జట్టును అతడు ఉదాహరణగా చూపాడు. అతను చేసిన ఈ ట్వీట్ నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతోంది.

చేతన్ కుమార్ క్రికెట్‌లో రిజర్వేషన్ కోటా డిమాండ్ చేయడం అది తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. "భారత క్రికెట్‌ జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు అగ్రవర్ణాలకు చెందినవారే. క్రికెట్‌లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తే జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంటుంది.." అని గతేడాది డిసెంబర్‌లో వ్యాఖ్యానించాడు.