ఇరాన్ ప్రతిదాడి ఆలోచన మానుకో: ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ప్రతిదాడి ఆలోచన మానుకో: ట్రంప్ వార్నింగ్

ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతిదాడి ఆలోచన మార్చుకోవాలని, లేదంటే ఇరాన్ లోని 52 ప్రదేశాలపై తాము అటాక్ చేస్తామని హెచ్చరించారు. ఏ ఒక్క అమెరికన్ కు హాని తలపెట్టినా, తమ దేశానికి సంబంధించిన ఆస్తులపై దాడి చేసినా ఇరాన్, ఆ దేశ కల్చర్ నాశనమవుతుందని చెప్పారు. ఆ దేశం ఊహించనంత వేగంగా, స్ట్రాంగ్ గా దాడి జరుగుతుందన్నారు. ఇరాన్, ఇరాక్, ఇండియా, యూకేల్లోని యూఎస్ ఎంబసీలపై దాడికి సులేమానీ కుట్ర చేశాడని, యుద్ధాన్ని రాకుండా ఆపడానికే అతడిని చంపామని చెప్పారు.

సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నేతలు మాట్లాడుతున్నారని, సులేమానీ భారీగా అమెరికన్లను చంపడంతో పాటు మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడని ట్రంప్ గుర్తు చేశారు. ఇంకా ఆ దేశ టెర్రరిస్టు నేతలు చాలా మందిని చంపారని చెప్పారాయన. అమెరికాపై దాడి చేసినందుకే తాము ఇరాన్ పై ప్రతిదాడి చేశామని చెప్పారు. మళ్లీ ప్రతీకార దాడి అంటే ఈ సారి తాము కొట్టే దెబ్బ ఇరాన్ తట్టుకోలేదని, గతంలో ఎన్నడూ జరగనంత స్ట్రాంగ్ అటాక్ ను చూస్తారని ట్రంప్ హెచ్చరించారు.