24 గంటల కరెంట్ ఇస్తున్నరని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

24 గంటల కరెంట్ ఇస్తున్నరని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

అలంపూర్, వెలుగు: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలని, నిరూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ చేశారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు.. ఏపీలో కరెంట్ లేదని, తెలంగాణలోనే 24గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. విమానంలో వెళ్లిన మంత్రికి రైతులు ఎక్కడ కనిపించారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సోమవారం ఆలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేంద్రస్వామి ఆలయాలను కుటుంబసమేతంగా ఎమ్మెల్యే దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9 లేదా 10గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, అసెంబ్లీలో చెప్పిన 24గంటల కరెంట్ మాటలకే పరిమితం అయిందన్నారు. మంత్రి స్థాయిలో ఉండి అబద్దాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఆలంపూర్ నియోజకవర్గంలో ఇతర పార్టీ నాయకులపైనే కాక సొంత పార్టీ లీడర్ల మీద దాడులు జరుగుతున్నాయన్నారు. ఆలంపూర్ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద నిధులు విడుదల చేస్తే.. ఆశించిన స్థాయిలో పనులు చేయకపోవడం బాధాకరమన్నారు.