బీజేపీపై పోరాటం చేస్తుండనే లాలూకు జైలు శిక్ష

బీజేపీపై పోరాటం చేస్తుండనే లాలూకు జైలు శిక్ష

దాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లూలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ల శిక్ష ఖరారు కావడంపై ఆయన కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. కోర్టు తీర్పుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. బీజేపీపై పోరాటం చేస్తున్నందుకే తన తండ్రిని జైలు పాలు చేశారని తేజస్వీ ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపి ఉంటే లూలూజీ సత్యహరిశ్చంద్రుడయ్యేవారని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించినందునే ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి తామెప్పుడూ భయపడమని అన్నారు.

దేశంలో కేవలం దాణా కుంభకోణం ఒక్కటే జరిగిందా అని తేజస్వీ ప్రశ్నించారు. ఒక్క బీహార్లోనే 80కిపైగా స్కామ్లు జరిగినా సీబీఐ, ఈడీ, ఎన్ఐఏలు ఎందుకు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల స్కాంలు చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలను సీబీఐ మర్చిపోయిందని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. దాణా స్కాంలో రాంచీ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. హైకోర్టు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.