రాహుల్​ లేకుంటే ఆగమాగమే..కాంగ్రెస్ వర్గాల్లో చర్చ

రాహుల్​ లేకుంటే ఆగమాగమే..కాంగ్రెస్ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ వారసత్వ పార్టీ అన్న ముద్ర పోవాలంటే తాను రాజీనామా చేయకతప్పదంటున్న రాహుల్​ గాంధీ నిర్ణయం మేలు కంటే కీడే చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్​ కోరినట్లు కొత్త చీఫ్​ ఎన్నికకు హైకమాండ్​ అంగీకరించిందన్న వార్తలతో దేశవ్యాప్తంగా నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నెహ్రూ ఫ్యామిలీ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ నడబలేదని బలంగా నమ్మే నేతలందరూ పార్టీని  వీడతారన్న చర్చ నడుస్తున్నది. మంగళవారం పలు ప్రాంతాల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆ చర్చను బలపర్చేలా ఉన్నాయి.

సొంత దారిలో సచిన్​?

అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్న తర్వాత కాంగ్రెస్​ను వీడే నేతల జాబితాలో ఆయన ఆప్తమిత్రులే టాప్​లో ఉన్నట్లు తెలుస్తున్నది. గడిచిన 15 ఏండ్లుగా రాహుల్​ మద్దతుతో ఎదిగిన సచిన్​ పైలట్​, జ్యోతిరాదిత్య సింధియా, తరుణ్​ గొగొయ్​లాంటి యువనేతలు తలోదారి చూసుకోబోతున్నట్లు సమాచారం. రాజస్థాన్​ పీసీసీ చీఫ్​గా ఐదేండ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన సచిన్​ పైలట్​.. కేవలం రాహుల్​ సూచన మేరకే సీఎం పోస్టును అశోక్​ గెహ్లాట్​కు వదిలేసి డిప్యూటీ పదవితో సరిపెట్టుకున్నారని, రాహులే లేని పక్షంలో సచిన్​ కూడా పార్టీలో ఉండరని రాజస్థాన్​కు చెందిన కాంగ్రెస్​ కార్యకర్త చెప్పారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్​ పైలట్​ కాంగ్రెస్​ను వీడతారని,  ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేపడతారని కార్యకర్తలు అంటున్నారు.

అంతటా అదే దారి

రాహుల్​ రాజీనామా తర్వాత రాజస్థాన్​తోపాటు కాంగ్రెస్​ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్, కర్ణాటకలోనూ ప్రభుత్వాలు కూలిపోతాయన్న చర్చ కూడా నడుస్తున్నది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా కనిపించే కాంగ్రెస్​లో డిసిప్లిన్​ గాడి తప్పుతుందని, నెహ్రూ ఫ్యామిలీ వాళ్లే పార్టీని ముందుకు నడిపించగలరని మెజార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు.