సీఎం ప్రగతి భవన్​లో పండుకుంటే అవార్డులెట్లా వస్తయ్​?

సీఎం ప్రగతి భవన్​లో పండుకుంటే అవార్డులెట్లా వస్తయ్​?

యాదాద్రి/చౌటుప్పల్ , వెలుగు : 'సమస్యలా..? ఎక్కడున్నయ్. సమస్యలున్నాయని ఎవరూ చెప్పడం లేదు. ఊరిలో ఎక్కడా మట్టి రోడ్డు లేదు. సందు సందులో సీసీ రోడ్లు. ప్రజలను సీఎం కలుస్తున్నారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నరు. ముఖ్యమంత్రి నిజంగా ప్రగతిభవన్​లో పండుకుంటే సమస్యలన్నీ ఎట్లా పరిష్కారమవుతయ్. కేంద్రం ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షన్​ సహా ఇతర అవార్డుల్లో తెలంగాణకే ఎట్లొస్తయి’ అని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సీఎంను ఎవరూ కలవడం లేదంటే వాళ్ల సమస్యలు అన్నీ తెలుసుకొని ముందే తీరుస్తున్నాడని అర్థం చేస్కోవాలె. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ముఖ్యమంత్రిని కలిస్తే పరిపాలనలో ఫెయిల్ అయినట్లే అని వ్యాఖ్యానించారు.  

బెదిరియ్యండివయా ?

  •     ఉద్యోగం, డబుల్ ​ఇండ్లు, పింఛన్​ గురించి జనాల ప్రశ్నలు 

యాదాద్రి​, వెలుగు : ఇక్కడున్న కంపెనీల్లో మన వాళ్లను ఎవరినీ తీసుకోవడం లేదంటూ నిరుద్యోగ సమస్య వివరించిన టీఆర్ఎస్​ లీడర్​కు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ''బెదిరియ్యండివయా”అంటూ సమాధానమిచ్చారు. ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తాళ్ల సింగారంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లిన ఆయనకు స్థానిక టీఆర్ఎస్​ లీడర్​ ఓ బీటెక్​ స్టూడెంట్​ను చూపించి “వీళ్ల అమ్మ కూలి పని చేసి కూతురును బీటెక్​ చదివించింది. ఆమెకు ఉద్యోగం రాక ఇంట్లోనే ఉంటోంది” అని చెప్పారు. వెంటనే  'ఇక్కడ ఉన్న కంపెనీల్లో మన వాళ్లను ఎవరినీ తీసుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి 'బెదిరియ్యండివయా’ అంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా మరోచోట తనకు పింఛన్​ రాలేదని ఓ మహిళ ప్రస్తావించగా 'ఈళ్లకిచ్చినం ఆళ్లకిచ్చినం. ఇస్తమమ్మా అందరికీ ఇస్తం’ అని అన్నారు. మరో మహిళ 'సార్..​డబుల్​ బెడ్​రూం, దళితబంధు అన్నరు ఏమైంది’ అని అనడంతో  'వస్తయమ్మా..అన్నీ ఒకేసారి కావు కదా’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.