దేశం బాగుపడాలంటే… పల్లె సల్లగుండాలె!

దేశం బాగుపడాలంటే… పల్లె సల్లగుండాలె!

బిజినెస్ లు కోలుకోవడానికి టైం కావాలి -రతన్ టాటా

నిరాశలో ఉన్న జనంలో కాన్ఫిడెన్స్ నింపాలి

కరోనాపై అలెర్ట్ గా ఉండాలి

ముంబై: కరోనా లాక్డౌన్ వల్ల ఇండియా ఎదుర్కొంటున్న ఎకనమిక్ క్రైసిస్ సమసిపోవాలంటే మొట్టమొదట చేయాల్సిన పని పల్లెటూళ్లలో సంపద పెంచడమేనని టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. గ్రామాల నుంచి వచ్చే డిమాండ్ ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని చెప్పారు. ఇందుకోసం పంటల దిగుబడి పెరిగేలా చూడాలని సూచించారు. ‘‘జనం ఇప్పుడు నిరాశలో ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవని వారికి చెప్పాలి. బిజినెస్లు ఇప్పటికిప్పుడు కోలుకోవడం కష్టం. కరోనా నుంచి జనాన్ని కచ్చితంగా రక్షించే వ్యాక్సిన్ గానీ ట్రీట్మెంట్ గానీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాదిలోపు ఏదో ఒక మందు వస్తుందని అందరూ నమ్ముతున్నారు. అలాంటిది జరుగుతుందా లేదా అనేది మనం నమ్మకంగా చెప్పలేం’’ అని టాటాట్రస్ట్స్ ఇంటర్నల్ మ్యాగజన్ హొరైజాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. విశేషాలన్నీ ఆయన మాటల్లోనే…

ఈ పనులు చేయడం ముఖ్యం..

దేశంలో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితికి మూడు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీలు బలహీనపడ్డాయి. ఇండియాలో దాదాపు ఎకనమిక్ క్రైసిస్ ఉంది. దీనికితోడు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జనం భయపడుతున్నారు.ఈ సవాళ్ల నడుమ మన ఎకానమీని నిలబెట్టాలి. ఇండస్ట్రీలను, వ్యవసాయరంగాన్ని పట్టాలెక్కించాలి. క్యాపిటల్ మార్కెట్ బాగుపడాలి. వస్తువులకు, సేవలకు డిమాండ్ను పెంచగలగాలి. అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జాబ్స్ కోల్పోయిన లక్షలాది మందికి చేయూత ఇవ్వాలి. ఫ్యూచర్లో ఎలా ఉండబోతోందో చెప్పడం కష్టం. ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. ప్రభుత్వం ఇంకేమి చేయగలుగుతుందో తెలియదు. ఎకానమీ రికవరీ చాలా పెద్ద సమస్యే!  కరోనా వంటి వ్యాధిని ప్రపంచం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఇంత పెద్ద సమస్య రావడం ఇదే తొలిసారి.

అంతా తెలుసు అనుకోవద్దు..

మనదేశంలో అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఎలాంటి సమస్యను అయినా పరిష్కరిస్తాం అనే నమ్మకంతో ఉంటాం. ఇలాంటి ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటాం. తేడాలు వస్తే మరింత నష్టం కలుగుతుంది. కరోనా రాకుండా ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాలి. రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కోసారి గుంతలో పడిపోయినా, తిరిగి లేస్తాం కదా! మనిషి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏర్పడ్డ సమస్యకు తప్పకుండా పరిష్కారం కనిపెడతాడు. అయితే అన్ని ఇనోవేషన్లు పనికి రాకపోవచ్చు. కొన్ని మాత్రం తప్పకుండా ఊరటను కలిగిస్తాయి. ఏ విషయంలోనూ హడావుడిగా తుది నిర్ణయానికి రాకూడదు. జనమందరికీ పోషకాహారం, కనీస వైద్యం దొరికేలా చేయడం, కేన్సర్ బాధితులకు సాయం అందించడం టాటా ట్రస్ట్ టార్గెట్లు. ఇందుకోసం  ప్రభుత్వంతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం.

జనం కోసమే టాటా..

టాటా ట్రస్ట్స్, టాటా గ్రూపులను కంపెనీ ఫౌండర్లూ జంషెద్జీ కొడుకులు దోరబ్, రతన్లు ఏర్పాటు చేశారు. పేద ప్రజల కష్టాలను తీర్చడం వీటి లక్ష్యం. పేదరికాన్ని తొలగించడానికి ఇవి రెండూ పనిచేస్తాయి. దేశానికి మంచి చేయడమనేది వీటి గుండెల్లోనే ఉంది. ఇండియా పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి టాటా కంపెనీలు కష్టపడుతున్నాయి. కరోనా వల్ల ఏర్పడ్డ ఆపదను మనం అవకాశంగా మలుచుకోవాలి. విమర్శలు చేసుకోవడానికి బదులు కలిసి పనిచేయాలి. ఎప్పుడు సమస్య వచ్చినా నేను అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను లెక్కలోకి తీసుకొని మాట్లాడతాను. చిన్న చిన్న విషయాలకు వాదోపవాదాలను మానేయాలి. అందరం ఒక్కటి కావాలి. 2008లో ముంబైపై టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు దేశమంతా ఏకమయింది.