ఇండ్ల పంపిణీపై ప్రజాప్రతినిధుల  తర్జన భర్జన 

ఇండ్ల పంపిణీపై ప్రజాప్రతినిధుల  తర్జన భర్జన 
  • నెలదాటినా ‘డబుల్​’ లబ్ధిదారులను  గుర్తించని అధికారులు
  • వీఆర్వోలు, వీఆర్ఏలు అందుబాటులో లేక షురూ కాని దరఖాస్తుల పరిశీలన.
  • వెంటనే ఇండ్లు పంచాలని   లబ్ధిదారుల డిమాండ్​

కామారెడ్డి ,వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కట్టిన డబుల్​బెడ్ రూం ఇండ్లు వందల్లో ఉంటే.. ఇండ్ల కోసం దరఖాస్తులు వేల సంఖ్యలో వచ్చాయి. జులైలో అప్లికేషన్లు తీసుకున్న అధికారులు  నెలరోజులు దాటుతున్నా.. వాటిని పరిశీలించి.. అర్హులైన వారిని  గుర్తించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.  ఇండ్లు తక్కువగా ఉండడం, అప్లికేషన్లు ఎక్కువ రావడంతో పంపిణీ ఎలా చేయాలని ప్రజాప్రతినిధులు తర్జన భర్జన పడుతున్నారు.  రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్​ మొదలవ్వడంతో  ఇండ్లు పంచిన తర్వాత ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నారు.   ఏండ్ల తరబడి కిరాయి ఇండ్లలో ఉండలేకపోతున్నామని వెంటనే ఇండ్లు పంచాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. 

కామారెడ్డి జిల్లాలో..

జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఇండ్లు లేని వారికి డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని  సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. అందులో భాగంగా పలు చోట్ల ప్రభుత్వం డబుల్​బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది.  జిల్లా వ్యాప్తంగా 8,226  ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 6 వేల ఇండ్ల వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి.  కామారెడ్డి,  బాన్స్​వాడ నియోజక వర్గాలు మినహా, జుక్కల్,  ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఇంకా  ‘డబుల్​’ ఇండ్ల పంపిణీ షురూ కాలేదు. కామారెడ్డి నియోజక వర్గంలో  భిక్కనూరు మండలం జంగంపల్లి,   బీబీపేట మండలం యాడారం,  కామారెడ్డి మండలం లింగాయపల్లిలోనే  పంపిణీ చేశారు.   

మున్సిపాలిటీ పరిధిలో..

మున్సిపాలిటీలోని రాజీవ్​నగర్​కాలనీ సమీపంతో పాటు, బీడీ కాలనీ,  రామేశ్వర్​పల్లి, దేవునిపల్లి,  టెకిర్యాల్, ఇల్చిపూర్​  లో ‘డబుల్’ ఇండ్ల నిర్మాణం పూర్తయి నాలుగేండ్లు కావస్తోంది. ఇప్పటి వరకు పంపిణీ మాత్రం జరగలేదు. గత జులైలో  వార్డుల వారీగా ప్రజల నుంచి రెవెన్యూ అధికారులు అప్లికేషన్లు స్వీకరించారు.  టౌన్​తో పాటు,  మున్సిపాలిటీలో విలీనమైన  ఊర్లు కలుపుకొని  49 వార్డుల్లో  5,236  అప్లికేషన్లు వచ్చాయి. రాజీవ్​నగర్​కాలనీ,  దేవునిపల్లి,  రామేశ్వర్​పల్లి, టెకిర్యాల్​,  ఇల్చిపూర్​లలో  730 ‘డబుల్’​ ఇండ్లు ఉన్నాయి. 

పరిశీలన షురూ కాలే..

ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి వారు అర్హులా?  కాదా?  తేల్చాల్సి ఉంటుంది.  గతంలో  వీఆర్వోలు, వీఆర్​ఏల సహకారంతో క్షేత్ర స్థాయిలో  దరఖాస్తులను పరిశీలించేవారు.  ప్రస్తుతం వీఆర్ఓలు లేరు.. వీఆర్ఏలు  నెల రోజులుగా సమ్మెలో  ఉన్నారు.  కానీ డబుల్​ఇండ్ల పంపిణీలో పరిశీల ప్రక్రియ కీలకం. అప్లికేషన్లు తీసుకుని నెలరోజులు దాటినా సిబ్బంది లేకపోవడంతో  పరిశీలన పెండింగ్​లో పడింది. 

కొందరికే ఇస్తే ఎట్లా..?

తక్కువ సంఖ్యలో డబుల్​ఇండ్లు అందుబాటులోకి రావడం.. వీటి కోసం వేల సంఖ్యలో  అప్లికేషన్లు రావడంతో  కొందరికే ఇస్తే ఎట్లా అనే దానిపై   ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఇండ్లు  కట్టుడు పూర్తయినా మౌలికవసతులు ఇంకా పూర్తికాలేదు.   రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్​లైన్లు,  తాగునీటి సరఫరా పైప్​లైన్లు వేయలేదు. మౌలిక వసతులకు సంబంధించి  ఇటీవల  ప్రభుత్వ విప్​ గంప  గోవర్ధన్​,  కలెక్టర్ జితేశ్​వి  పాటిల్​లు సంబంధిత శాఖల ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మౌలిక వసతులకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు.  

సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తాం

కామారెడ్డిలో డబుల్​బెడ్ రూం ఇండ్ల పంపిణీకి  ఇటీవల అప్లికేషన్లు స్వీకరించాం.  ప్రస్తుతం వీఆర్వోలు లేకపోవడంతో ఇతర శాఖలకు చెందిన సిబ్బందితో పరిశీలన చేయిస్తాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే  వార్డుల వారీగా లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపడుతాం.
- ప్రేమ్​కుమార్, తహసీల్దార్, కామారెడ్డి