కేసీఆర్​కు ఓటేస్తే బిచ్చగాళ్లమవుతాం : నిరుద్యోగి సత్యనారాయణ

కేసీఆర్​కు ఓటేస్తే బిచ్చగాళ్లమవుతాం : నిరుద్యోగి సత్యనారాయణ
  • మునుగోడులో నామినేషన్   
  • అంతకుముందు బిచ్చగాడి వేషంలో అడుక్కుని నిరసన

చండూరు, వెలుగు : మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ వేయడానికి వచ్చిన ఓ నిరుద్యోగి చండూరులో భిక్షాటన చేసి నిరసన తెలిపాడు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్​డీ చేశాడు. నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగాలు రాకపోవడంతో కలత చెంది అధికార పార్టీ తీరుకు నిరసనగా మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్​గా నామినేషన్​ వేశాడు. కేసీఆర్​కు ఓటేస్తే బిచ్చగాళ్లమవుతామంటూ బిచ్చగాడి వేషం వేసుకుని దానం అడిగాడు.

సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే ఉద్యోగాలు లేక బిచ్చగాళ్లుగా మారాల్సిన పరిస్థితి తలెత్తిందన్నాడు. సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని గల్లీకి ఒక  బెల్ట్ షాపు ఇచ్చి తాగుడుకు బానిసలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్​ను రాజకీయ నిరుద్యోగిగా మార్చేంత వరకు పోరాటం చేస్తామని, గజ్వేల్, కామారెడ్డిలో ఓడగొట్టి తీరుతామన్నాడు. పెన్షన్లు, రైతుబంధు పథకాలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. తాను గజ్వేల్​లో కూడా నామినేషన్​వేసినట్టు చెప్పాడు. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.