ట్రైన్​​లో బొమ్మను మరిస్తే.. ఇంటికెళ్లి ఇచ్చిన్రు

ట్రైన్​​లో బొమ్మను మరిస్తే.. ఇంటికెళ్లి ఇచ్చిన్రు

సికింద్రాబాద్, వెలుగు: ఏడాదిన్నర బాలుడు తనకిష్టమైన బొమ్మను రైలులో మర్చిపోయాడు. ఓ ప్యాసింజర్ ఇచ్చిన సమాచారంతో తిరిగి దాన్ని ఆ చిన్నారికి అప్పగించారు రైల్వే పోలీసులు. ఈ అరుదైన ఘటన వివరాలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అగర్తలకు చెందిన భుసిన్ పట్నాయక్ ఈ నెల 4న సికింద్రాబాద్ నుంచి అగర్తలకు స్పెషల్ ట్రైన్​లో బయలుదేరాడు. అతడి సీటు పక్కనే19 నెలల బాబుతో ఓ ఫ్యామిలీ ఉంది. బాలుడు తన ట్రక్ టాయ్​తో చాలా ఇష్టంగా ఆడుకోవడాన్ని భుసిన్ గమనించాడు.

బాలుడి ఫ్యామిలీ వెస్ట్ బెంగాల్ లోని నార్త్ దినాజ్ పూర్ జిల్లా అలియాబురి రైల్వే స్టేషన్ లో దిగిపోయింది. బాలుడు బొమ్మను ట్రెయిన్ లోనే మర్చిపోయిన విషయాన్ని గుర్తించిన భుసిన్ ఎలాగైనా దాన్ని అతనికి చేరవేయాలనుకున్నాడు. వెంటనే ‘ రైల్ మదద్’ యాప్ ద్వారా రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో న్యూ జల్పాయ్ గురి స్టేషన్​లో భుసిన్ నుంచి రైల్వే సిబ్బంది ఆ బొమ్మను తీసుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్​కు ఫోన్ చేసి, భుసిన్ పక్క సీటు రిజర్వేషన్ వివరాలు సేకరించారు. అలియాబురి స్టేషన్​కు 20 కి.మీ. దూరంలో ఉన్న వారి ఇంటికి వెళ్లిన బాలుడికి బొమ్మను అందజేశారు.