పోలవరం ముంపుపై ఐఐటీ హైదరాబాద్ సర్వే!.. కసరత్తు మొదలు పెట్టిన నిపుణులు

పోలవరం ముంపుపై  ఐఐటీ హైదరాబాద్ సర్వే!.. కసరత్తు మొదలు పెట్టిన నిపుణులు
  • కసరత్తు మొదలుపెట్టిన నిపుణులు
  • నెల క్రితం క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణులు
  • ప్రాథమిక డేటా సేకరణ
  • ఈ నెలాఖారున మళ్లీ సర్వే చేయనున్న ఎక్స్ పర్ట్స్ 

హైదరాబాద్, వెలుగు:  పోలవరం బ్యాక్ వాటర్​ ముంపుపై స్టడీ చేసేందుకు ఐఐటీ హైదరాబాద్​ కసరత్తు మొదలు పెట్టింది. ఎక్కడెక్కడ ఎంత ప్రభావం ఉంటుందో తేల్చేందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనుంది. అందులో భాగంగా గత నెల ఐఐటీ హైదరాబాద్​ నిపుణులు డాక్టర్ ​ సతీశ్​ కె.రేగొండ, ప్రొఫెసర్​ కేబీవీఎన్​ ఫణీంద్ర క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అక్కడ స్థానిక అధికారులతో సమావేశమై భద్రాచలంతో పాటు వివిధ ప్రాంతాల్లో గోదావరి నదీ తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి మరోసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి ముంపుపై సర్వే మొదలుపెట్టనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, పోలవరం ముంపుపై సర్వే చేయించేందుకు ఐఐటీ హైదరాబాద్​తో ఈ ఏడాది జూన్​ 25న కొత్తగూడెం సీఈ ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే నెల క్రితం నిపుణులు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కాగా, పోలవరం బ్యాక్​ వాటర్​తో మన రాష్ట్రంలో కలిగే ముంపు ప్రభావంపై జాయింట్​ సర్వే చేయించేందుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కృష్ణా గోదావరి బేసిన్​ ఆర్గనైజేషన్​కూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ రాసింది. అయితే, దానికి సమాంతరంగా మన ప్రభుత్వం కూడా ఐఐటీ హైదరాబద్​తో సర్వే చేయిస్తున్నది. 

ఈ స్టడీలు చేస్తరు..

సర్వేలో భాగంగా ముంపు వల్ల ఎక్కడ ఎలాంటి ప్రభావం పడుతుందో ఐఐటీ హైదరాబాద్​ నిపుణులు తేల్చనున్నారు. ప్రీఅనాలిసిస్​లో భాగంగా భద్రాచలం పట్టణం, అక్కడి భూమి పరిస్థితులు, వరద ముంపు ఉన్న ప్రాంతాల మ్యాపులు, డ్రైనేజ్​ వ్యవస్థ మ్యాపులు, నదీప్రవాహ పరిస్థితులు, హైడ్రాలజీ డేటా, వరద రక్షణ చర్యలు వంటి వాటిపై స్టడీ చేయనున్నారు. దుమ్ముగూడెం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు గోదావరి నదీ తీరాన్ని విశ్లేషించనున్నారు. అక్కడ వర్షపాత వివరాలు, క్లైమేట్​ ప్యాటర్న్​, హైడ్రాలజీ డేటా, వాగులు, వంకల ప్రవాహాలు, పూడిక, రివర్​ క్రాస్​ సెక్షన్​, కొన్ని దశాబ్దాలుగా అక్కడ వరద వస్తున్న తీరు వంటివాటిపై విశ్లేషణ చేయనున్నారు.దీనికి సంబంధించి గతంలో పబ్లిష్​ అయిన రిపోర్టులనూ రివ్యూ చేయనున్నారు. 

ఆ రెండేండ్లలో వచ్చిన వరదపైనా విశ్లేషణ..

గోదావరి నదికి గతంలో రెండుసార్లు వచ్చిన వరదలపై ఐఐటీ హైదరాబాద్​ నిపుణులు అధ్యయనం చేయనున్నారు. 1986 ఆగస్టులో భద్రాచలం వద్ద గోదావరి నదిలో 27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఆ ఏడాది 75.6 అడుగుల ఎత్తులో నది ప్రవహించింది. గోదావరి నది హిస్టరీలో భద్రాచలం వద్ద ఇప్పటి వరకూ అదే రికార్డు వరద. తర్వాత 2022 జులైలో 21.74 లక్షల  క్యూసెక్కుల వరద రాగా.. నది 71.3 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 2022లో వచ్చిన వరదలకు భద్రాచలం టౌన్​ ఐదు రోజులు వరదల్లోనే ఉండగా, 99 గ్రామాలు నీట మునిగాయి. దీంతో ఆ రెండు సందర్భాల్లో వచ్చిన వరదలపై ఐఐటీ నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.