జడ్చర్లలో బీఆర్ఎస్​ లీడర్ల అక్రమ దందా

జడ్చర్లలో బీఆర్ఎస్​ లీడర్ల అక్రమ దందా
  • 35 ఏండ్ల కిందటి ప్లాట్ల అమ్మకం 
  • డబుల్​రిజిస్ట్రేషన్లతో కొనుగోలుదారులకు ఇక్కట్లు
  • మున్సిపల్​చైర్​పర్సన్​ఇంటిని ముట్టడించిన బాధితులు

జడ్చర్లలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు బీఆర్ఎస్​ లీడర్లు వాలిపోతున్నారు. పాత వెంచర్లను సైతం కబ్జా చేసి అమ్మేస్తున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఎన్​హెచ్​ 44 పక్కన ఇదివరకే ఉన్న ప్లాట్లను చెరిపేసి, వాటిని అగ్రికల్చర్​ల్యాండ్స్​గా క్రియేట్​ చేశారు. ఇందుకు భారీ మొత్తంలో డబ్బును రెవెన్యూ ఆఫీసర్లకు ముట్టజెప్పి, ఆ భూములను వారి పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మహబూబ్​నగర్/జడ్చర్ల టౌన్​​, వెలుగు: జడ్చర్ల మండలం మాచారం శివారులో సర్వే నంబర్​ 41, 42, 43లో 70 ఎకరాల భూమి ఉంది. ఇందులో 35 ఏండ్ల కిందట కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వెంకటాద్రి పేరుతో రియల్​ ఎస్టేట్​ వెంచర్​ డెవలప్​ చేశాడు. ఈ వెంచర్​లో 130 గజాల చొప్పున వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. దీన్ని హైదరాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తులకు అప్పగించాడు. ఈ ఇద్దరు స్కీం పేరుతో ప్లాట్లను అమ్మేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ ప్లాట్ల మీద జడ్చర్ల మున్సిపాల్టీకి చెందిన కొందరు లీడర్ల కన్ను పడింది. ఇక్కడ రోడ్డు బిట్​ ప్లాట్​ విలువ గజం రూ.40 వేలు ఉండగా, సెకండ్​బిట్​ప్లాట్​గజం విలువ రూ.35 వేల వరకు ఉంది. దీంతో ఎలాగైనా ఈ భూమిని తమ వశం చేసుకోవాలని ఏడాది కిందట కొందరు బీఆర్ఎస్ ​లీడర్లు ప్లాన్ ​వేశారు. స్కీం కింద ప్లాట్లను అమ్మిన హైదరాబాద్​కు చెందిన ఇద్దరితో దోస్తీ చేసుకున్నారు. కొంత మొత్తంలో వారికి డబ్బు ముట్టజెప్పారు. వారి పేరు మీద డిజిటల్​ పట్టాదారు పాసు పుస్తకాన్ని తీయించారు. ఈ పాస్​ బుక్కు ఆధారంగా నవంబరు 11, 2022న దాదాపు 14.10 ఎకరాలను మరో వ్యక్తి పేరు మీద రిజిస్ర్టేషన్​ చేశారు. వారం రోజులుగా అక్రమార్కులు పాత ప్లాట్లను తొలగిస్తున్నారు. ప్లాట్ల మధ్య ఉన్న హద్దురాళ్లను జేసీబీల ద్వారా తొలగించి చదును చేస్తున్నారు. ఇక్కడ తిరిగి కొత్త వెంచర్​ వేయడానికి ప్లాన్ ​గీయిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం మున్సిపాల్టీకి చెందిన బీఆర్ఎస్​ లీడర్​ కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈయన నియోజకవర్గ లీడర్​కు అత్యంత సన్నిహితుడు కావడంతో అడ్డు చెప్పేందుకు అందరూ భయపడుతున్నారు. దీనికితోడు ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు తెలిసింది. మొత్తం పది మంది బ్యాచ్​గా ఏర్పడి పాత ప్లాట్ల ఓనర్లను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

గతంలో సైతం ఇలానే..

గతంలో సైతం ఇలానే డబుల్​ రిజిస్ట్రేషన్లు చేయడంతో కొనుగోలుదారులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారు. జడ్చర్ల-, మహబూబ్​నగర్​ ప్రధాన రహదారిని ఆనుకొని 67 ఎకరాల్లో తిరుమలనగర్, వెంకటేశ్వర నగర్, మహబూబ్​నగర్​టౌన్​ షిప్ ​పేరుతో మొత్తం 1,400 ప్లాట్లను ఏర్పాటు చేశారు. 1997లో వాయిదాల ప్రకారం ప్రజలు డబ్బులు కట్టి ప్లాట్లను 
రిజిస్ర్టేషన్​ చేయించుకున్నారు. అయితే 31 మే 2022న రూలింగ్​ పార్టీకి చెందిన లీడర్లు ఈ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రి ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించి చదును చేశారు. ఒకరి ప్లాట్​ను మరొకరి పేరు మీద డబుల్​ రిజిస్ర్టేషన్​ చేశారు. ఈ వ్యవహారంలో కూడా రూలింగ్​పార్టీకి చెందిన లీడర్ల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

మున్సిపల్​ చైర్​పర్సన్ ​ఇంటి ఎదుట బాధితుల ధర్నా

పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్లను అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఆదివారం మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ 44కు కూతవేటు దూరంలో ఉన్న వెంకటాద్రి వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో తాము 30 ఏండ్ల కింద ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. సీ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తమ ప్లాట్లను కొందరు వ్యక్తులు చదును చేస్తుండడంతో వెళ్లి నిలదీయగా..  తమకు ప్లాట్లు అమ్మినట్లు కాగితాలు చూపుతున్నారని వాపోయారు. ఈ వెంచర్​కు చెందిన ఇద్దరు యజమానులు మరొకరికి జీపీఏ చేశారని,  వారందరితో పట్టణానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై తమ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో మున్సిపల్ ​చైర్​పర్సన్​ భర్త ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వారి ఇంటిని ముట్టడించారు. సీఐ రమేశ్​బాబు బాధితులకు సర్దిచెప్పారు. ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామనడంతో ఆందోళన విరమించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వ్యవసాయ భూమిగా ఎట్ల మార్చిన్రు

మాచారం వట్టిపల్లి సురేందర్​ పేరు మీద 14.10 ఎకరాలను డబుల్ రిజిస్ట్రేషన్​ చేశారు. ఇప్పటికే ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. వాటిని మళ్లీ వ్యవసాయ భూమి అని చెప్పి ఎలా రిజిస్ట్రేషన్​ చేస్తారు. ఇందులో బీఆర్ఎస్​ లీడర్ల ప్రమేయం ఉంది.  ఈ విషయం మీద జడ్చర్ల సీఐకి కంప్లైంట్​చేశాం. సీఐ ఎమ్మెల్యేతో మాట్లాడి యాక్షన్​ తీసుకుంటామని చెప్పారు.

- శ్యామ్, జడ్చర్ల

20 ప్లాట్లు కొన్నాం

ఇక్కడ మేం 20 ప్లాట్లు కొన్నాం. వాటిని ఇతరులకు అమ్మాం. ఇంకా రెండు ప్లాట్లు మిగిలి ఉన్నాయి. ఈ భూమిని వేరేవాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్​ చేశారని తెలిసి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నా. పచ్చి నీళ్లు కూడా ముట్టలేదు. భయంగా ఉంది. ప్లాట్లు కొన్నవారు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలె. నాకు ఏం అర్థం కావడం లేదు.

- అంజత్, జడ్చర్ల

బట్ట కాల్చి నా మీద వేస్తుండ్రు

41, 42, 43 సర్వే నంబర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటికి సంబంధించిన లావాదేవీలు కూడా నాకు తెల్వదు. ప్రతీది నా మీద బట్ట కాల్చి వేస్తుండ్రు. ఆ సర్వే నంబర్లలో నేను ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. కొందరు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం మీద హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తా.

- దోరేపల్లి రవీందర్, 
   బీఆర్ఎస్​ లీడర్, జడ్చర్ల,